'ఐ బొమ్మ' రవి ఏక్ నిరంజన్ కాడా? భారీగా నెట్ వర్కు?

కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన ఆఫీసులో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.;

Update: 2025-11-22 04:28 GMT

నేను ఒక్కడినే.. ఏక్ నిరంజన్ ను. నన్నేం చేసినా ఫర్లేదు.. ఇలా పోలీసు కస్టడీలో చెబుతున్న ఐబొమ్మ రవి మాటల్లో నిజం ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆరేళ్లుగా పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తగా ఉంటున్న ఐబొమ్మ రవిని ఇటీవల పోలీసులు అరెస్టు చేయటం.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రెండో రోజు కస్టడీలో అతడి నెట్ వర్కు గురించి పలు ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. అయితే.. తాను ఒక్కడినేనని.. ఏక్ నిరంజన్ గా చెబుతున్న రవి మాటల్లో నిజమెంత? అన్నది ప్రశ్నగామారింది.

పోలీసుల అనుమానాలకు బలమైన కారణాలు లేకపోలేదు. 100కు పైగా వెబ్ సైట్లు.. 21 వేల పైరసీ సినిమాలు.. ఇదంతా ఒక్కడితోనే సాధ్యమవుతుందా? అన్నది ఒక అనుమానమైతే.. తెర వెనుక రవికి ఎంతమంది సహకరిస్తున్నారు? అన్నది మరో ప్రశ్నగా మారింది. అంతేకాదు.. భారతదేశం బయట యూకే.. స్విట్జర్లాండ్.. నెదర్లాండ్స్ లో లింకులపై ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. తమిళ వెబ్ సైట్ల నుంచి అతను పలు సినిమాల్ని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు.

కరేబియన్ దీవుల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని.. యూకేలోని టెకీల సాయంతో పైరసీ సినిమాల దందా సాగించినట్లుగా భావిస్తున్నారు. రవి అప్ లోడ్ చేసిన అన్ని సినిమాలు హెచ్ డీ క్వాలిటీతోనే ఉన్నాయి. థియేటర్లలో సెల్ ఫోన్ సాయంతో కొత్త సినిమాల్ని రికార్డు చేసి తమిళ వెబ్ సైట్లకు అమ్మే వారి నుంచి కొన్ని సినిమాలను సాఫ్ట్ వేర్ సాయంతో హెచ్ డీ క్వాలిటీగా మార్చి వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసినట్లుగా భావిస్తున్నారు.

కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన ఆఫీసులో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. రవి తల్లిదండ్రులు ఇద్దరూ చిన్నప్పుడే వేరు పడటం.. ఎన్నో తంటాలు పడి బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసినట్లుగా గుర్తించారు. జాబ్ కోసం ముంబయికి వెళ్లినప్పుడు ఎన్నోరోజులు అర్ధాకలితో తాను ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐటీ మీద ఉన్న అనుభవంతో సంస్థను స్టార్ట్ చేసిన అతను.. లవ్ మ్యారేజ్ తర్వాత కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎనిమిదేళ్ల కూతురు ఉన్నా.. నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు.

తన జీవితంలో తనకు ఎదురైన పాఠాలతో డబ్బు సంపాదించాలన్నకసితో తాను పని చేసినట్లుగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ.. బప్పం వెబ్ సైట్లలోనే పైరసీ సినిమాల్ని పోలీసులు తొలగించారు. అయితే.. ఈ రెండు వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసిన సినిమాలు మరో వెబ్ సైట్ కు లింక్ అయ్యేలా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవటంతో.. ఇంకెన్నివెబ్ సైట్లు పని చేస్తున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఐబొమ్మ.. బప్పం వెబ్ సైట్లలో లోని లింక్ ల్ని క్లిక్ చేస్తే.. మిగిలిన పైరసీ సైట్లలోకి వెళ్లి సినిమాలు చూసే వీలుందని చెబుతున్నారు. మొత్తంగా ఐబొమ్మ రవి నెట్ వర్కు మొత్తాన్ని నిర్వీర్యం చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News