రాజస్థాన్‌ లో కుప్పకూలిన జాగ్వార్ యుద్ధ విమానం... ఏం జరిగింది?

అవును... రాజస్థాన్‌ లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయిందని తెలుస్తోంది.;

Update: 2025-07-09 09:53 GMT

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు చెందిన జాగ్వార్‌ యుద్ధ విమానం కూలిపోయిందని తెలుస్తోంది. రాజస్థాన్‌ లోని చురు జిల్లాకు చెందిన భానుడా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే... ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారని అంటున్నారు.

అవును... రాజస్థాన్‌ లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వైమానిక దళ పైలట్ మరణించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ విమానం సూరత్‌ గఢ్ వైమానిక స్థావరం నుండి బయలుదేరిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో సహాయక చర్యల నిమిత్తం పోలీసు బృందాలను ఘటనా స్థలానికి పంపినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన స్థానిక స్టేషన్ ఎస్.హెచ్.ఓ. కమలేష్... క్రాష్ సైట్ సమీపంలో మానవ అవశేషాలు కనుగొనబడ్డాడని.. అయితే ప్రాణనష్టానికి సంబంధించి ఐఏఎఫ్ నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉందని అన్నారు!

కాగా... ఈ సంవత్సరం జాగ్వార్ విమానం కూలిపోవడం ఇది రెండవసారి అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ లో గుజరాత్‌ లోని జామ్‌ నగర్ వైమానిక దళ స్టేషన్ సమీపంలోని శిక్షణా కార్యక్రమంలో ఐఏఎఫ్ జాగ్వార్ కూలిపోయింది. ఆ విమానం జామ్‌ నగర్ కు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్దా గ్రామం సమీపంలోని మైదానంలో కూలిపోయింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లలో ఒకరు సురక్షితంగా బయటపడగలిగారు! ఇందులో భాగంగా.. పైలట్లలో ఒకరైన సిద్ధార్థ్ యాదవ్ తన కో-పైలట్‌ ను సకాలంలో బయటకు పంపించడంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు యాదవ్ సకాలంలో జెట్ నుండి బయటకు రాలేకపోయాడు.

Tags:    

Similar News