పాక్‌ను దెబ్బకొట్టిన 'వార్ హీరో' మూవీ తెలుసా?
భారతదేశ చరిత్రలో కొన్ని కథలు మనల్ని అబ్బురపరుస్తాయి.. మనలో దేశభక్తిని ప్రేరేపిస్తాయి.;
భారతదేశ చరిత్రలో కొన్ని కథలు మనల్ని అబ్బురపరుస్తాయి.. మనలో దేశభక్తిని ప్రేరేపిస్తాయి. అలాంటి అద్భుతమైన కథలలో ఒకటి భారత వాయుసేన కమాండర్ డి.కె.పరుల్కర్ ది.ఈయన తాజాగా తుదిశ్వాస విడిచినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. 1965 ఇండోపాక్ యుద్ధంలో ప్రత్యర్థులు ఆయన విమానంలో కాల్పులు జరిపారు. ఫ్లైట్ వదిలేసి ప్రాణాలు కాపాడుకోమని ఉన్నతాధికారులు చెప్పారు. కానీ ధైర్యంగా విమానాన్ని తిరిగి బేస్ కు చేర్చారు. ఇక 1971 నాటి ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో ఆయన చూపించిన ధైర్యం, తెగువ, శత్రువుల నుండి తప్పించుకోవడంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన మానసిక స్థైర్యం దేశ చరిత్రలో నిలిచిపోయాయి.
-యుద్ధభూమిలో చిక్కుకున్న ‘వార్ హీరో’
1971లో ఇండో-పాక్ యుద్ధం ముమ్మరంగా సాగుతోంది. ఆ సమయంలో యువ పైలట్ అయిన పరుల్కర్ విమానం శత్రుప్రాంతంలో కూలిపోయింది. పాకిస్తాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుని రావల్పిండిలోని ఒక జైలులో బందీగా ఉంచింది. ప్రతికూల పరిస్థితులు, శత్రువుల క్రూరమైన వ్యవహారాల మధ్య ఆయనకు మానసిక స్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది, కానీ పరుల్కర్ మాత్రం దృఢంగా నిలబడ్డారు.
-చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సాహసం
పరుల్కర్ గారు కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడానికే ప్రయత్నించలేదు, ఆయనతోపాటు బందీలుగా ఉన్న మరికొంతమంది భారతీయ పైలట్లను కూడా సురక్షితంగా బయటపడటంలో సహాయపడ్డారు. పాకిస్తాన్‌లోని అత్యంత కఠినమైన భద్రతా వలయాలను ఛేదించి, మనుగడకు అత్యంత కష్టమైన పరిస్థితులలోనూ ఆయన తన తోటి సైనికులకు నాయకుడిగా నిలిచారు. పరుల్కర్ , తన సహ పైలట్లతో కలిసి చేసిన ఈ ఎస్కేప్ ఆపరేషన్ ఒక సాధారణ తప్పించుకునే ప్రయత్నం మాత్రమే కాదు, ఇది ధైర్యానికి, వ్యూహాత్మక ఆలోచనకు, నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ సాహసంపైనే 'ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్' అనే పేరుతో ఒక చలనచిత్రం కూడా నిర్మించబడింది. ఇది ఆనాటి సంఘటనలను, పరుల్కర్ గారి ధైర్య సాహసాలను ప్రజలకు తెలియజేసింది.
-గౌరవాలు.. గుర్తింపులు
దేశానికి ఆయన చేసిన ఈ అసాధారణ సేవలకు గుర్తింపుగా, ఆయనకు భారత వాయుసేన మెడల్, విశిష్ట సేవా పతకం వంటి గొప్ప గౌరవాలు లభించాయి. పరుల్కర్ వీరత్వం కేవలం యుద్ధరంగంలో శత్రువులతో పోరాడటం మాత్రమే కాదు, ప్రతికూల పరిస్థితులలోనూ తన మానసిక బలం ద్వారా తన తోటి సైనికులకు.. దేశానికి స్ఫూర్తినిచ్చారు. ఆయన చేసిన త్యాగాలు, చూపించిన సాహసం యువ తరాలకు దేశభక్తి విలువలను తెలియజేస్తాయి.
డి.కె.పరుల్కర్ కథ మనకు దేశభక్తి అంటే కేవలం యుద్ధంలో పోరాడటం మాత్రమే కాకుండా.. ప్రతి క్షణం దేశం కోసం, మన తోటి సైనికుల కోసం నిలబడటం అని గుర్తుచేస్తుంది. ఆయన జీవితం, త్యాగం , నాయకత్వం భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.