సొంతింటి కల మరింత దూరం! హైదరాబాద్‌లో చుక్కలు చూపిస్తున్న ధరలు!
హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వరకు తన పరిధిని పెంచుకుంటోంది.;
హైదరాబాద్‌లో సొంతింటి కల మరింత భారంగా మారుతోంది! నగరం నలువైపులా విస్తరిస్తున్నా, ఇళ్ల ధరలు మాత్రం చుక్కలనంటుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు డిమాండ్ పెరిగిపోవడంతో, భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. తాజాగా విడుదలైన ఒక కీలక రిపోర్ట్ హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. చదరపు అడుగు ధర ఎంత ఉందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.
హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును దాటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు వరకు తన పరిధిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఇళ్ల, మరియు భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం వేలం వేస్తున్న భూములు సైతం కోట్లలో పలుకుతున్నాయి. ఇక ప్రైవేటుగా ఉన్న స్థలాల ధరలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రముఖ స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక హైదరాబాద్‌తో సహా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో కొత్తగా ప్రారంభించిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఇళ్లు, ఫ్లాట్ల సగటు ధరల వివరాలను అందించింది.
ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం, దేశంలోని 9 ప్రధాన నగరాల్లో కొత్తగా ప్రారంభమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల సగటు ధర 9 శాతం మేర పెరిగింది. నిర్మాణ సామగ్రి వ్యయాలు పెరగడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ 9 నగరాల్లో నివాస గృహాల సగటు చదరపు అడుగు ధర రూ. 13,197కు చేరుకుందని నివేదిక వెల్లడించింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,569గా ఉంది.
కొత్త ప్రాజెక్టుల్లో సగటు ఇళ్ల ధరలు కోల్‌కతాలో గరిష్ఠంగా 9 శాతం పెరిగాయి. థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతం ధరలు పెరిగాయి. అయితే ముంబై, నవీ ముంబై ప్రాంతాల్లో మాత్రం 3 శాతం చొప్పున ధరలు తగ్గాయి.
హైదరాబాద్ నగరం విషయానికి వస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు చదరపు అడుగు ధర రూ. 7,890 వద్ద ఉండగా, అది 5 శాతం పెరిగి రూ. 8,306కు చేరుకుందని నివేదిక స్పష్టం చేసింది. అంటే, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.
నగరాల వారీగా సగటు ధరలు (చదరపు అడుగులలో):
* బెంగళూరు: 2023-24 - రూ. 8577, 2024-25 - రూ. 9852
* కోల్‌కతా: 2023-24 - రూ. 6201, 2024-25 - రూ. 8009
* చెన్నై: 2023-24 - రూ. 7645, 2024-25 - రూ. 7989
* హైదరాబాద్: 2023-24 - రూ. 7890, 2024-25 - రూ. 8306
* పుణె: 2023-24 - రూ. 9877, 2024-25 - రూ. 10,832
* థానే: 2023-24 - రూ. 11,030, 2024-25 - రూ. 12,880
* ఢిల్లీ-ఎన్‌సీఆర్: 2023-24 - రూ.13,396, 2024-25 - రూ.14,020
* నవీ ముంబై: 2023-24 - రూ. 13,286, 2024-25 - రూ. 12,855 (తగ్గుదల)
* ముంబై: 2023-24 - రూ. 35,215, 2024-25 - రూ. 34,026 (తగ్గుదల)