ఎకరం రూ.151.25 కోట్లు! కోకా పేట రికార్డు బద్దలుకొట్టింది పో
ఒక దానిని మించి మరోటి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మామూలుగాలేదు.;
ఒక దానిని మించి మరోటి.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మామూలుగాలేదు. ఎకరం వందల ఎకరాలు విలువ చేస్తున్నాయి. గత కొనుగోళ్లను మించి ధరలు పలుకుతున్నాయి. రియల్ ఎస్టేట్ పరిస్థితి దిగజారిపోతున్న పరిస్థితిలో హైదరాబాద్ రియల్ మార్కెట్ మాత్రం రోజురోజకు రికార్డులు బద్దలు కొడుతుండడం విశేషం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మరోసారి నిరూపించుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం, కోకాపేటలోని 'నియోపోలిస్ లేఅవుట్'లో శుక్రవారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్వహించిన ఈ-వేలంలో భూమి ధరలు రికార్డుస్థాయికి చేరాయి. ఎకరానికి రూ.151.25 కోట్లు ధర పలకడం ద్వారా, ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఈ విజయం తెలంగాణ ప్రభుత్వానికి, హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయాన్ని అందించడమే కాకుండా, నగర రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై పెట్టుబడిదారులలో ఉన్న విశ్వాసాన్ని దృవీకరించింది.
రికార్డు బ్రేకింగ్ వేలం వివరాలు
హెచ్‌ఎండీఏ ఈ వేలానికి ఎకరం భూమికి రూ.99 కోట్లుగా ప్రారంభ ధరను నిర్ణయించింది. అయితే కోకాపేట ప్రాంతం ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉండటం.. అద్భుతమైన మౌలిక సదుపాయాలు కలిగి ఉండటంతో రియల్ ఎస్టేట్ దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పోటీ కారణంగా ధరలు ఆరంభ ధరను సుమారు 52 శాతం మేర అధిగమించాయి.
ఈ వేలంలో రెండు ప్లాట్లు అత్యధికంగా ధర పలికాయి. ప్లాట్ నెంబర్ 15 లో 4.03 ఎకరాలు.. ప్రతి ఎకరం రూ.151.25 కోట్లు పలికింది. లక్ష్మీనారాయణ కంపెనీ కొనుగోలు చేసింది.ఇక ప్లాట్ నెంబర్ 16లోని 5.03 ఎకరాలు ప్రతి ఎకరం రూ.147.75 కోట్లు పలికింది. దీన్ని కొనుగోలు చేసింది గోద్రెజ్ ప్రాపర్టీస్. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ తీవ్ర పోటీ వేలం ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ రెండు ప్లాట్లలోని మొత్తం 9.06 ఎకరాల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.1,353 కోట్లు ఆదాయం లభించింది.
నియోపోలిస్‌లో తిరుగులేని డిమాండ్
కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ కొద్ది కాలంలోనే విలువ పరంగా తిరుగులేని ఆస్తిగా మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడ వరుసగా రికార్డు ధరలు నమోదవుతున్నాయి. పాత రికార్డు బద్దలైంది. ఈ నెల 24న జరిగిన మునుపటి వేలంలో 18వ ప్లాట్ ఎకరం భూమి రూ.137.25 కోట్లు పలికింది. ఇప్పుడు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తాజాగా ప్లాట్ నెంబర్ 15కు ఎకరం రూ.151.25 కోట్లు ధర పలకడం ద్వారా ఆ పాత రికార్డును అధిగమించింది. ఈ అసాధారణ వృద్ధి రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద సంచలనం సృష్టించింది. కోకాపేట అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ కు అతి దగ్గరగా ఉండటం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ హబ్‌లకు సామీప్యత కలిగి ఉండటం, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉండటం దీని డిమాండ్‌ను అమాంతం పెంచాయి.
హెచ్‌ఎండీఏ ఆదాయానికి ఊతం: లక్ష్యం రూ.10,000 కోట్లు!
ఈ వేలం విజయంతో హెచ్‌ఎండీఏకు ఈ ఏడాదిలో లభించిన మొత్తం ఆదాయం భారీగా పెరిగింది. భవన అనుమతులు, లేఅవుట్ల దరఖాస్తులు పెరగడం ద్వారా ఇప్పటికే సంస్థకు రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ తాజా వేలం ద్వారా లభించిన మొత్తాన్ని కలుపుకుంటే ఈ ఏడాది ఆదాయం మరింత పెరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రాంతాల్లో వేలాలు నిర్వహించడం ద్వారా భారీ ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాబోయే వేలాలు చూస్తే.. డిసెంబరు 3న నియోపోలిస్‌లోని 19, 20 ప్లాట్లలోని 8 ఎకరాల వేలం వేయనున్నారు. డిసెంబరు 5న కోకాపేట్ గోల్డెన్ మైల్‌లోని 1.98 ఎకరాల వేలం వేయనున్నారు. భవిష్యత్తు ప్రైమ్ ఏరియాలు చూస్తే.. రాబోయే రోజుల్లో బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ, బాచుపల్లి, బౌరంపేట్, చెంగిచర్ల, సూరారం వంటి ఇతర ప్రైమ్ ఏరియాల్లో ఉన్న విలువైన ల్యాండ్ పార్శిళ్లను వేలం వేయనున్నారు.ఈ వేలాల ద్వారా సుమారు రూ.10,000 కోట్లకు పైగా ఆదాయం రానుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం నగరం యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఇతర ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడనుంది.
జాతీయ స్థాయిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముద్ర
కోకాపేటలో నమోదైన ఈ తాజా రికార్డు ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కించాయి. సాంప్రదాయంగా ఉన్న మార్కెట్ ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరిందని, ఇది స్థిరమైన అభివృద్ధికి, పెట్టుబడులకు హైదరాబాద్ ఎంత అనుకూలమైనదో తెలియజేస్తోందని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్, ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉంది.