హైదరాబాద్ మెట్రో రియాలిటీ...విశాఖ విజయవాడ సంగతేంటి ?

హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉండాలని దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు రవాణా సులభతరం అవుతుందని భావించారు.;

Update: 2025-09-14 00:30 GMT

హైదరాబాద్ లో దాదాపుగా కోటి మంది జనాభా ఉంటారు. అంతే కాదు దక్షిణాదిన అతి పెద్ద నగరం. ఉపాధి కేంద్రం, పారిశ్రామికంగా కీలక స్థానం, సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ, టూరిజం ఇలా ఏ విధంగా చూసినా హైదరాబాద్ అన్నింటికీ మూల కేంద్రంగా ఉంది. అంతే కాదు అన్ని సీజన్లలో సరిపోయే క్లైమేట్ తో సాటి మేటి నగరంగా ఉన్న హైదరాబాద్ కి ఒక కలికితురాయిగా మెట్రో రైలు ప్రాజెక్ట్ ఉంది. ప్రజా రవాణాను నియంత్రించేందుకు మెట్రో ఒక మేలైన పరిష్కారంగా భావించి ఆనాడు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని తెర మీదకు తెచ్చారు.

ఎనిమిదేళ్ళ మెట్రో ప్రాజెక్ట్ అలా :

హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉండాలని దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు రవాణా సులభతరం అవుతుందని భావించారు. పైగా లాభసాటిగా ఉంటుందని కూడా లెక్కలేశారు. అలా ఎంతో కసరత్తు చేసి మొదలెట్టిన ఈ ప్రాజెక్ట్ ని 2017 నవంబరులో ప్రారంభించారు. ఆనాడు నాగోల్ అమీర్ పేట, మియాపూర్ మార్గంలో ప్రారంభించారు. ఆ తరువాత రెండవ దశగా ఎల్బీ నగర్, అమీర్ పేట మార్గాన్ని 2018 అక్టోబరులో ప్రారంభించారు. ఆ మీదట అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో ప్రారంభించారు. అదే వరుసలో జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం 2020 ఫిబ్రవరి నుండి అందుబాటులోకి వచ్చింది. అలా హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపుపొందింది కూడా.

తొలి అయిదేళ్ళలో 31 కోట్ల మంది :

ఇక ఈ మెట్రో రైలు ప్రారంభించిన తొలిరోజే రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించారని లెక్కలు ఉన్నాయి. 2022 నవంబరు 29 నాటికి అయిదేళ్ళలో మెట్రోలో 31 కోట్ల మంది ప్ర‌యాణించారని అధికార వివరాలు ఉన్నాయి. అంతే కాదు ఈ మెట్రోలో ప్ర‌తిరోజూ 4.40 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణం చేస్తున్నారు. ప్రయాణీకులకు అన్ని వైపుల నుంచి అందుబాటులో స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా టైమింగ్స్ ని కూడా ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా చేశారు.

చేతులెత్తేసిన ఎల్ అండ్ టీ :

ఇంతలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉన్నా కూడా నష్టాలు అయితే తప్పడం లేదు అని అంటున్నారు. దాంతో మెట్రో రైల్ నిర్వహణపై ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్ద ఎత్తున వస్తున్న నష్టాల కారణంగా మెట్రోను ఇకపై నడపడం తమ వల్ల కాదని తేల్చేసింది. అందువల్ల ఈ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి తాము అప్పగించాలని ఆలోచిస్తున్నామని స్పష్టం చేసింది. అంతే కాదు తమ ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఎల్ అండ్ టీ ఉన్నతాధికారులు తాజాగా లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.

బకాయిలు పేరుకుపోయాయి :

ఇక మెట్రో ఎనిమిదేళ్ళ ప్రస్థానంలో తాము ఆశించిన విధంగా లాభాలు లేవని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు గత కొంతకాలంగా మెట్రో రైలుకు ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇక పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలతో సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని కూడా అసలు విషయం కూడా చెప్పేశారు. ప్రయాణీకుల టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం మెట్రో రైల్ నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని కుండబద్ధలు కొట్టారు. ఇలాంటి ఆర్ధికపరమైన ఇబ్బందులలో ఉంటూ మెట్రోను నడపడం తమకు భారంగా మారిందని తమ వల్ల కూడా కాదని ఎల్ అండ్ టీ అధికారులు ఆవేదనతో కూడిన అసక్తతను వ్యక్తం చేశారు.

తెలంగాణా ప్రభుత్వానికే :

ఈ నేపధ్యంలో హైదరాబాద్ మెట్రో నిర్వహణను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని తాము ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వారు తెలిపారు. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రో రైలు నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. మరి దీని మీద కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలని అంటున్నారు.

విశాఖ విజయవాడ మీద ఫోకస్ :

ఇక ఏపీలో చూస్తే రెండు మెట్రో ప్రాజెక్టులు విశాఖ విజయవాడ నగరాలలో చేపట్టాలని చూస్తున్నారు. డీపీఆర్ కూడా పూర్తి అయింది. మూడు దశలుగా చేపట్టాలని నిర్ణయించారు. అయితే విశాఖలో పాతిక లక్షల దాకా జనాభా ఉంది. మెగా సిటీగా పేరుంది. నగరానికి ఫ్లోటింగ్ పాపులేషన్ ప్రతీ రోజు లక్షలలో ఉంటుందని ఒక అంచనా. అదే విధంగా విజయవాడ విషయంలో కూడా ఉంది. దాంతో ఈ రెండు చోటో మెట్రో కూత పెట్టించాలని చూస్తున్నారు. అయితే కోటి మంది జనాభా ఉంటూ పదుల లక్షలలో ఫ్లోటింగ్ జనాభా ఉంటే అక్కడే మెట్రో వర్కౌట్ కాలేదని పెను భారమని అంటూంటే ఈ రెండు సిటీలలో ఎలా అన్నది చర్చకు వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News