నో చెప్పారని.. పెళ్లైన 7ఏళ్లకు ఆమె భర్తను చంపేశాడు!
కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంచలన ఉదంతంలోకి వెళితే..;
హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకున్న ఒకడు.. వారింట్లో అందుకు నో చెప్పటం.. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేసేయటం.. ఏడేళ్ల తర్వాత కూడా ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని.. ఆమె భర్తను హత్య చేసిన షాకింగ్ ఉదంతం కుకట్ పల్లి హౌసింగ్ బోర్డులో చోటు చేసుకుంది. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంచలన ఉదంతంలోకి వెళితే..
రాజమండ్రి పరిధిలోని ములగాడకు చెందిన 30 ఏళ్ల వెంకటరమణ కాకినాడకు చెందిన శ్రావణి సంధ్యతో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వారికి పిల్లలు లేరు. కేపీహెచ్ బీలోని భగత్ సింగ్ నగర్ లో భార్యతో కలిసి ఉంటూ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరికి దగ్గర్లోనే తోడల్లుడు దుర్గాప్రసాద్ ఉంటాడు. వీరిద్దరి భార్యలు వారం క్రితం బంధువుల పెళ్లి ఉండటంతో ఊరికి వెళ్లారు.
ఆదివారం రాత్రి 11 గంటల వేళలో దుర్గా ప్రసాద్ డ్యూటీకి వెళ్లగా.. అతడి గదిలో వెంకటరమణతో పాటు.. దుర్గాప్రసాద్ తమ్ముడు జగదీశ్.. బావమరిది లక్ష్మీనారాయణ ఉన్నారు. అర్థరాత్రి వేళలో వీరు ఉండే ఇంటి వెనుక ఖాళీ స్థలంలో ఐదుగురు యువకులు గట్టిగా అరుస్తూ ఉన్నారు. దీంతో అసలేం జరుగుతుందన్న ఆలోచనతో బయటకు వచ్చి.. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలోని గ్రిల్ వద్దకు వెళ్లాడు. అక్కడ 27 ఏళ్ల పవన్ గ్రిల్ బయట నుంచి కత్తితో వెంకటరమణ గుండెల్లో పొడిచేశాడు. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇంతకూ ఈ పవన్ ఎవరు? వెంకటరమణను ఎందుకు హత్య చేశాడు? అన్న ప్రశ్నలకు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. శ్రావణి సంధ్యకు పవన్ కు గడిచిన ఎనిమిదేళ్లుగా పరిచయం ఉంది. శ్రావణిని పెళ్లి చేసుకోవటానికి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తల్లిదండ్రులను అడిగించాడు.అయితే.. వారు ఒప్పుకోలేదు. ఆ తర్వాత వెంకటరమణతో పెళ్లి చేశారు. అప్పటి నుంచి వెంకటరమణను చంపేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడు. పథకం ప్రకారం ఆదివారం రాత్రి వేళలో నలుగురితో వచ్చి.. వెంకటరమణను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు పవన్ తప్పించుకుపోగా.. మిగిలిన నలుగురు స్నేహితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా పవన్.. శ్రావణి సంధ్యలు టచ్ లో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారు.