ఐదేళ్ల చిన్నారి హత్యతో కోట్లు పోసి ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలోనూ రక్షణ లేదా?
కేసును తీవ్రంగా పరిగణించిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
కోట్లు పోసి ఇల్లు కొన్నాం.. చుట్టూ కాపలాగా ఎత్తైన గోడలు, భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు ఉన్నాయి.. ఇక మన పిల్లలకు ఏ లోటూ లేదు, ఇక్కడైతే క్షేమంగా ఉంటారని ఆ తల్లిదండ్రులు నమ్మారు. కానీ బయటి ప్రపంచంలోని రాబందుల కంటే భద్రత అనుకున్న ఆ కాంపౌండ్ గోడల మధ్యే అంతటి ఘాతుకం దాగి ఉందంటే ఆ కడుపుకోతను ఏ మాటలతో వర్ణించగలం? కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌లో ఐదేళ్ల పసిపాప ఆరేలియా (మోను) నవ్వులు ఒక్కసారిగా మూగబోయిన తీరు ప్రతీ ఒక్కరి గుండెను పిండేస్తోంది.
సైకిల్ తొక్కుకుంటూ అమాయకంగా నవ్విన ఆ చిన్నారిని.. చాక్లెట్ ఆశచూపి కాలకూట విషమై ముంచేసిన ఆ కిరాతకుడి చేతుల్లో చిన్నారి ఎంతగా విలవిలలాడిందో తలచుకుంటేనే నరాలు తెగిపోతున్నాయి. నాన్న ప్రేమ, అమ్మ పెంపకం నడుమ హాయిగా ఎదగాల్సిన ఆ చిట్టి ప్రాణం.. ఆశాపేరాశలతో నిండిన ఒక రాక్షసుడి దెబ్బకు నీటి సంపులోనే అనంత వాయువుల్లో కలసిపోయింది.
సెక్యూరిటీ ఉంది కదా అని ధైర్యంగా ఉన్న కుటుంబాలకు ఈ ఘటన ఒక తీరని హెచ్చరికగా మిగిలింది. అందమైన విల్లాలు, విలాసవంతమైన కమ్యూనిటీలు ఉన్నంత మాత్రాన మానవత్వమే మృగమై మారిన వేళ భద్రత ఎక్కడుంది? నవ్వుతూ తిరిగిన మోను ఇక లేదనే నిజం ఆ తల్లిదండ్రులను, కన్నవారందరినీ అశ్రునయనాలతో ముంచెత్తుతోంది. ఆ పసిపాప ఆత్మకు శాంతి చేకూరాలన్నా ఆ తల్లిదండ్రుల కంటిపాపకు న్యాయం జరగాలన్నా ఆ కిరాతకుడికి చట్టం విధించే శిక్ష కఠినాతికఠినంగా ఉండాల్సిందే..
హైదరాబాద్ శివారులోని కౌకూర్‌లో చోటుచేసుకున్న ఐదేళ్ల చిన్నారి హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. లక్షల రూపాయలు వెచ్చించి విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్నా చిన్నారులకు భద్రత లేకపోతే ఎలా? అనే ప్రశ్నలు ఈ ఘటనతో తెరపైకి వచ్చాయి. డబ్బుల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు, విషయం బయటపడుతుందనే భయంతో బాలికను హత్య చేయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం గమనార్హం.
చాక్లెట్ ఆశ చూపించి.. కిడ్నాప్‌కు ప్లాన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 2019లో వలస వచ్చిన సైంటిస్ట్ మిల్టన్ ఫెర్నాండెజ్ మోసెస్, డేజీ ఇవాంజెలియా కుటుంబం కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఐదేళ్ల కుమార్తె ఆరేలియా మోజెస్ అలియాస్ మోనుతో పాటు జేడెన్ అనే కుమారుడు ఉన్నారు.
బీహార్‌లోని నలందా జిల్లాకు చెందిన విక్రమ్ కుమార్ గతంలో అదే గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అయితే, అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఈ నెల 6న విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో తరచూ క్లబ్‌హౌస్‌కు వచ్చే చిన్నారి ఆరేలియాను కిడ్నాప్ చేయాలని పథకం రచించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అక్టోబర్ 10న సైకిల్ తొక్కుకుంటూ క్లబ్‌హౌస్‌కు వెళ్లిన చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి నిందితుడు సెల్లార్‌లోని అండర్‌గ్రౌండ్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక తన మాట వినడం లేదనే కారణంతో నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు సమాచారం. అనంతరం రాళ్లు కట్టి చిన్నారి మృతదేహాన్ని అక్కడి నీటి సంపులో పడేశాడు. ఆ తర్వాత బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
130 సీసీటీవీ ఫుటేజీల పరిశీలన
చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గేటెడ్ కమ్యూనిటీలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బాలిక కమ్యూనిటీ బయటకు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో లోపలే ఏదో జరిగి ఉండవచ్చని అనుమానించారు. ఈ క్రమంలో క్లబ్‌హౌస్‌లోని సెల్లార్ సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.
కేసును తీవ్రంగా పరిగణించిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు 130 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, చిన్నారితో కలిసి కనిపించిన వ్యక్తి ఆ తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. కాల్ రికార్డులు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
గేటెడ్ కమ్యూనిటీల భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటనతో గేటెడ్ కమ్యూనిటీల్లో భద్రతా ఏర్పాట్లు ఎంతవరకు పటిష్ఠంగా ఉన్నాయనే చర్చ మొదలైంది. సెక్యూరిటీ గార్డుల నియామకం, వారి ప్రవర్తనపై పర్యవేక్షణ, క్లబ్‌హౌస్‌లు, సెల్లార్లలో నిఘా, చిన్నారుల భద్రత వంటి అంశాలపై మరింత శ్రద్ధ అవసరమని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన నిందితుడికి మరణశిక్ష విధించాలని చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
విలాసవంతమైన ఇళ్లు, ఆధునిక సదుపాయాలు, సీసీ కెమెరాలు ఉన్నంత మాత్రాన భద్రతకు పూర్తి హామీ లభించదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా చిన్నారుల విషయంలో అప్రమత్తత, సమర్థవంతమైన భద్రతా పర్యవేక్షణ ఎంత అవసరమో కౌకూర్ ఘటన స్పష్టం చేస్తోంది.