'కాలం' ఎవరినైనా తీర్చేస్తుంది.. ఎలాంటి సౌదీ.. ఇప్పుడెలా మారింది
ఒకప్పుడు అరబ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా.. అపారమైన సైనిక సంపద.. ఆయుధాలతో పెద్దన్న పాత్రను పోషించిన దేశం ఇప్పుడు హౌతీల దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే అంటారు కాలపరీక్షలో నెగ్గినోడికి తిరుగు ఉండదని. ఒకప్పుడు అరబ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా.. అపారమైన సైనిక సంపద.. ఆయుధాలతో పెద్దన్న పాత్రను పోషించిన దేశం ఇప్పుడు హౌతీల దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి. హౌతీల వరుస క్షిపణి దాడులతో రాజధాని రియాద్ తో సహా కీలక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారటమే కాదు.. సౌదీకి అసలుసిసలు అధికార కేంద్రంగా భావించే సౌదీ యువరాజు భద్రత సైతం ప్రశ్నార్థకంగా మారటం.. హుటాహుటిన బంకర్లలో తలదాచుకునే వరకు విషయం వెళ్లటం చూస్తే.. కాలం మాత్రమే ఎవరినైనా తీర్చేస్తుందన్న మాట మదిలో మెదలటం ఖాయం.
అపార భద్రతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెప్పే సౌదీ రాజభవనం అడ్రస్ తాజాగా మారటమే దీనికి నిదర్శనం. సౌదీ యువరాజు బిన్ సల్మాన్ బంకర్లు ఉన్న భవనాల్లోకి మారినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. సౌదీ యువరాజు 41 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ చివరిసారిగా గత మంగళవారం నిర్వహించిన జాతీయ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. గడిచిన వారంలో సౌదీ మీద హౌతీల దాడులు అంతకంతకూ పెరుగుతున్నయి.
తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం సౌదీ యువరాజును అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న బంకర్లతో కూడిన రాజభవనాలకు తరలిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ భవనాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగాబంకర్లు ఏర్పాటు చేశారు.అంతేకాదు యువరాజు భద్రత కోసం ఆయనకు అత్యంత విశ్వాసం ఉన్న ప్రత్యేక టీంను నియమించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు సౌదీ యువరాజు ఎక్కడ ఉన్నారు? అన్నది బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.
ఇప్పటివరకు అరబ్ ప్రపంచంలో ఏ కీలక నిర్ణయమైనా సౌదీ అరేబియా కనుసన్నల్లోనే జరిగేది. పొరుగు దేశాల రక్షణకు తానే పెద్దన్నగా వ్యవహరించిన సౌదీ.. ఇప్పుడు తన రక్షణ కోసం పాకిస్తాన్.. టర్కీ లాంటి దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోని పరిస్థితి. ప్రపంచంలోనే అత్యధిక రక్షణ బడ్జెట్ (సుమారు 83 బిలియన్ డాలర్లు) కేటాయించే దేశాల్లో ఒకటైన సౌదీ.. ఇప్పుడు తన రక్షణను తాను చూసుకోలేని దుస్థితి. అది కూడా ఒక చిన్న గెరిల్లా ముఠాగా చెప్పే హౌతీలు.. సౌదీ రక్షణ వలయాన్ని ఛేదించి.. నేరుగా సౌదీ రాజధాని రియాద్ మీద దాడులు చేస్తారని ఎవరూ అనుకోలేదు.
అలాంటి పరిస్థితి ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇరాన్ సాయంతో హౌతీలు చెలరేగిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇరాన్ అందించే ఆయుధాలతో వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తూ సౌదీకి షాక్ ఇవ్వటం ద్వారా హౌతీ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి ఇప్పుడు భిన్నమైన పద్ధతిలో అర్థమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ ను తక్కువగా అంచనా వేయకూడదన్న విషయం అర్థమవుతోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ మొదలుకొని పలు ప్రాంతాల్లో దాడులు చేస్తూ.. ఆ దేశ ప్రజలకు యుద్ధ భయాలను అనుభవంలోకి తేవటంలో హౌతీలు.. ఇరాన్ విజయవంతమైనట్లుగా చెబుతున్నారు.
హౌతీల దాడులకు ముందు వరకు సౌదీ అరేబియా ఇమేజ్ ప్రపంచంలో వేరుగా ఉండేది. అత్యంత శక్తివంతమైన దేశంగా.. పశ్చిమాసియా రాజకీయాలను.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక తిరుగులేని సురక్షిత ప్రాంతంగా పేరుండేది. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారుగా.. ప్రపంచ ఆర్థిక పరిస్థితిని సౌదీ నియంత్రించేదన్న ఇమేజ్ ఉండేది. అలాంటి సౌదీ చమురు క్షేత్రాల మీదా..రవాణా మార్గాల మీదా హౌతీలు దాడులు చేస్తారని.. పట్టు సాధిస్తారని.. సౌదీని షేక్ చేస్తారన్న అంచనానే లేదు. అందుకు భిన్నమైన పరిణామాలతో అత్యంత సురక్షితమైన.. లాభదాయకమైన పెట్టుబడులకు కేంద్రంగా ఉన్న సౌదీ ఇప్పుడు సమస్యల్లో కూరుకుపోవటమే కాదు.. దాని భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది. మొత్తంగా తనను కెలికిన అమెరికాను.. ఆ దేశానికి అండగా నిలిచిన దేశాలకు ఇరాన్ తలనొప్పిగా మారటమే కాదు తనను దెబ్బ తీసే వారిని తాను వదలనన్న సందేశాన్ని సౌదీ రూపంలో ఇచ్చినట్లుగా చెబుతున్నారు.