వల్లభనేని వంశీ మళ్లీ డ్యూటీ ఎక్కారు! కార్యకర్తలతో మాస్ స్పీచ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన నేతల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ముందు వరుసలో ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ నియోజకవర్గ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో అధికార కూటమికి భయపడకుండా కార్యకర్తల్లో ధైర్యం నింపే బాధ్యతను భుజాలకెత్తుకున్నారని అంటున్నారు. స్థానిక ఎన్నికలకు నేడో రేపో నగారా మోగుతుందని అనగా, గన్నవరం నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వెనుక జగన్ ఉన్నారని, తనను ఎవరూ ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పెట్టకుండా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమైన నేతల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ముందు వరుసలో ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆయన చూసిన దూకుడు కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనే అభిప్రాయం ఉంది. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టు చేసిన పోలీసులు సుమారు 150 రోజుల పాటు నిర్బంధంలోనే ఉంచారు. ఈ క్రమంలో ఆయనపై వరుస కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు ఈ కేసుల విషయంలో పెద్దగా మాట్లాడని మాజీ ఎమ్మెల్యే వంశీ స్థానిక ఎన్నికల సమయంలో కాస్త గట్టిగానే సౌండ్ చేస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
తాజాగా గన్నవరం కార్యకర్తల సమావేశం నిర్వహించిన వంశీ ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధం చేసే క్రమంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. వైసీపీకి ప్రజల్లో ఆదరణ ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మన చిటికెను వేలి వెంట్రుకను కూడా ఎవరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించి అగ్గి రాజేశారు. మహా అయితే ఏం చేయగలరు? నాపై 33 కేసులు పెట్టారు, 150 రోజులు జైల్లో పెట్టారు? నేను అవినీతి చేశానని కేసులు పెట్టారా? టీడీపీలో ఉండగా నాలుగేళ్లు నంబర్ వన్ ఎమ్మెల్యే అంటూ పొగిడేవారు. చంద్రబాబు, లోకేశ్ బాబుతో విభేదించిన తర్వాత అవినీతి ఆరోపణలు, కేసులు పెట్టారు అంటూ వంశీ ఆరోపించారు.
తిడితే కూర్చోవాలా?
ఇక తనను లోపల వేశారని సంతోష పడుతున్నారని, నన్ను లోపల వేసిన వాడిని లోపల వేసిన వాడు ఎవడో తెలుసు కదా? నా వెనుక ఆయన ఉన్నారు అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై వంశీ దాడి చేయడం ద్వారా తన వైఖరి మునుముందు ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారని అంటున్నారు. తాను అవినీతి చేశానని కేసులు పెట్టలేదని, ఎవరినో తిట్టానని మాత్రమే కేసులు పెట్టారని అన్నారు. నన్ను తిట్టిన వారిని తాను తిరిగి తిట్టకూడదా? అంటూ ప్రశ్నించిన వంశీ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేయడమే చర్చనీయాంశం అవుతోంది.
మళ్లీ రచ్చకు సిద్ధమా?
కాగా, మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్ తాజా వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల ద్వారా టీడీపీ కేడర్ ను రెచ్చగొట్టాలనే వ్యూహంతోపాటు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తన అనుచరులు, వైసీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పాలనే ఆలోచన ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసులు, కూటమి నుంచి ఎదరయ్యే ఒత్తిళ్లకు భయపడితే ఇబ్బంది తప్పదనే ఆలోచనతో మాజీ ఎమ్మెల్యే దూకుడు పెంచినట్లుగా ఉందని అంటున్నారు. మొత్తానికి మళ్లీ దూకుడుగానే ఉండాలనే నిర్ణయంలో భాగంగానే ఆయన దేనికైనా రెడీ అన్న సంకేతాలు పంపుతున్నట్లుగా భావిస్తున్నారు.