అమెరికాలో విషాదం: గ్రేట్ స్మోకీ మౌంటెన్స్‌లో సోలో హైకింగ్‌కు వెళ్లి భారతీయ యువకుడు మృతి

టెక్సాస్‌కు చెందిన సాహిల్ జిలానీ ఇటీవల అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గ్రేట్ స్మోకీ మౌంటెన్స్ నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు.

Update: 2026-10-13 10:28 GMT

అమెరికాలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాహసయాత్ర చేయాలనుకున్న ఒక భారతీయ యువకుడి ఆశలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒంటరిగా హైకింగ్‌కు వెళ్లిన 24 ఏళ్ల సాహిల్ జిలానీ అనే యువకుడు జలపాతం వద్ద ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. టెక్సాస్‌లో నివాసముంటున్న సాహిల్ మృతిచెందడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

అసలేం జరిగింది?

టెక్సాస్‌కు చెందిన సాహిల్ జిలానీ ఇటీవల అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గ్రేట్ స్మోకీ మౌంటెన్స్ నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఒంటరిగా హైకింగ్ చేయడం అతని ఉద్దేశం. అయితే ప్రయాణానికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులకు సాహిల్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. అతడిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ లభ్యం కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబీకులు వెంటనే స్థానిక పోలీసులకు, పార్క్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ముమ్మరంగా సాగిన గాలింపు చర్యలు

సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పార్క్ రేంజర్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించారు. నేషనల్ పార్క్‌లోని ప్రముఖ హైకింగ్ మార్గానికి సమీపంలో సాహిల్ నడిపి వచ్చిన కారును అధికారులు గుర్తించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో అన్వేషణను మరింత తీవ్రతరం చేశారు.

గాలింపు బృందాలు శ్రమిస్తూ అబ్రామ్స్ ఫాల్స్ జలపాత ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడ ఉన్న కఠినమైన కొండ ప్రాంతాలు, జారుడు బండరాళ్లు వేగవంతమైన నీటి ప్రవాహం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. అయినప్పటికీ నిరంతరం శోధించిన బృందాలకు, చివరకు జలపాతం సమీపంలోని నీటి కొలనులో మునిగిపోయిన స్థితిలో సాహిల్ మృతదేహం లభ్యమైంది.

ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే?

నీటి ఉపరితలం పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ, అడుగున ఉండే బలమైన అంతర్గత ప్రవాహాల కారణంగానే సాహిల్ ప్రమాదంలో చిక్కుకుని ఉంటాడని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరణానికి గల కచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

ఈ విషాద వార్త విన్న సాహిల్ తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురై స్పృహ తప్పిపడిపోవడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే ఉన్నత భవిష్యత్తు ఉన్న కుమారుడు ఇలా విగతజీవిగా మారడాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది.

సోలో హైకింగ్ చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రకృతి రమణీయత, జలపాతాలు ఎంతగా ఆకట్టుకున్నా వాటి వెనుక ఊహించని ప్రమాదాలు దాగి ఉంటాయని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. సాహసయాత్రలు సోలో హైకింగ్ చేసేవారు తప్పనిసరిగా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. మీరు వెళ్లే మార్గం, సమయం తిరిగొచ్చే వివరాలను కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ముందే స్పష్టంగా తెలియజేయాలి. పార్క్ అధికారులు నిర్దేశించిన ట్రైల్స్ దాటి ప్రమాదకర లోయలు లేదా నీటి ప్రవాహాల వైపు వెళ్లకూడదు. జలపాతాల వద్ద రాళ్లు బాగా జారుడుగా ఉంటాయి. నీటి అడుగున ఉండే సుడిగుండాలు, బలమైన ప్రవాహాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది కాబట్టి నీటిలోకి దిగకపోవడమే మంచిది. స్థానిక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే పవర్ బ్యాంక్, ఫస్ట్ ఎయిడ్ కిట్, GPS పరికరాలను వెంట ఉంచుకోవాలి.

ప్రకృతిని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో భద్రతా నియమాలను పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. సాహిల్ జిలానీ అకాల మరణం ఆయన కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది.

Tags:    

Similar News