పులివెందులను కాపాడుకునేలా.. జగన్ కీలక నిర్ణయం

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత ఇలాకాలో గెలిచి ఆయనకు షాక్ ఇవ్వాలని కూటమి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయని అంటున్నారు.

Update: 2026-10-13 12:30 GMT

స్థానిక ఎన్నికల్లో సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకునేలా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైనాట్ పులివెందుల అంటూ రణనినాదం చేస్తున్న కూటమికి చెక్ చెప్పాలనే నిర్ణయంలో భాగంగా తన సొంత కుటుంబం నుంచే మున్సిపల్ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారని చెబుతున్నారు. జగన్ బాబాయ్, పులివెందుల నియోజకవర్గ వైసీపీ వ్యవహారాలను పర్యవేక్షించే వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారని అంటున్నారు. ప్రమీలమ్మ గతంలోనూ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేయడం, కూటమి అభ్యర్థిని దీటుగా ఎదుర్కొవాలంటే తమ కుటుంబ సభ్యులే పోటీ చేయాలనే ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత ఇలాకాలో గెలిచి ఆయనకు షాక్ ఇవ్వాలని కూటమి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయని అంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తమకు పోటీ కూడా అవకాశం లేకుండా చేసిన చోట మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం దక్కించుకోవాలని చాలా కాలంగా స్కెచ్ వేస్తున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచి జగన్ రెడ్డికి షాక్ ఇచ్చిన టీడీపీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తోందని అంటున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి జోరుకు బ్రేకులు వేసేలా జగన్ రెడ్డి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తాజా ఎంపిక ద్వారా రుజువు అవుతోందని అంటున్నారు.

కూటమి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం, ప్రత్యక్ష ఎన్నికలు కావడం వల్ల సరైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనే ఆలోచనతో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ప్రమీలమ్మను జగన్ రెడ్డి పోటీకి దింపాలని జగన్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి స్వయాన చిన్నాన్న అయిన వైఎస్ మనోహర్ రెడ్డి సతీమణి ప్రమీలమ్మకు పులివెందుల పట్టణంలో మంచి గుర్తింపు ఉందని అంటున్నారు. స్థానికంగా మనోహర్ రెడ్డి, ప్రమీలమ్మ పార్టీ బాధ్యతలు చూస్తున్నందు వలన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జగన్ రెడ్డి ఆలోచనగా ఉందని అంటున్నారు.

పులివెందుల మున్సిపాలిటీ మాజీ సీఎం జగన్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా చెబుతున్నారు. పంచాయతీగా ఉన్నప్పటి నుంచి జగన్ రెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనమే నడుస్తూ వస్తోందని అంటున్నారు. జగన్ రెడ్డి నాన్నమ్మ జయమ్మ గతంలో పంచాయతీ సర్పంచ్ గా పనిచేశారని, అప్పటి నుంచి 2005లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత కూడా వైఎస్ కుటుంబ సభ్యుల హవానే కొనసాగిందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏకపక్షంగా గెలుచుకున్న పులివెందుల తమ కుటుంబ ప్రతిష్టకు నిదర్శనంగా జగన్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ఇక్కడ నుంచి మరెకవరీ అవకాశం ఇవ్వకూడదని ఆలోచనతో ఆయన తన పిన్ని ప్రమీలమ్మను పోటీకి పెడుతున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News