బెంగాల్ ఎన్నికల్లో టర్నింగ్ పాయింట్? హౌరా బ్రిడ్జ్ ఘటనే మమత ఓటమికి నాంది..

పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక పెను మార్పు కనిపిస్తోంది. దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ కోటలు ఇప్పుడు బీటలు వారాయి.;

Update: 2026-05-04 16:30 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక పెను మార్పు కనిపిస్తోంది. దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ కోటలు ఇప్పుడు బీటలు వారాయి. టీఎంసీని ఓడించి బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.. ఈ రాజకీయ ప్రకంపనలకు ప్రధాన కారణం కేవలం ఒక ఎన్నికల మేనిఫెస్టోనో లేదా ఒక పార్టీ ప్రచారమో కాదు.. అది హౌరా బ్రిడ్జ్ సాక్షిగా ఒక సామాన్య వృద్ధుడు చూపిన అసాధారణ ధైర్యం. ఆ ఒక్క సంఘటన బెంగాల్ రాజకీయ గమనాన్ని మార్చివేసిందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

బెంగాల్ రాజకీయాల్లో నూతన అధ్యాయం.. హౌరా బ్రిడ్జ్ ఘటన

గత పదిహేనేళ్లుగా మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం బెంగాల్‌ను పాలిస్తోంది. నాడు వామపక్షాల సుదీర్ఘ పాలనను అంతం చేస్తూ "మా, మాతి, మానుష్" (తల్లి, భూమి, ప్రజలు) నినాదంతో అధికారంలోకి వచ్చిన దీదీ, కాలక్రమేణా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన అమానుష ఘటన రాష్ట్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాతి పరిణామాలు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి.

మలుపు తిప్పిన ఆ దృశ్యం

నిరసనకారులు న్యాయం కోసం 'నబన్నా అభియాన్' (సచివాలయ ముట్టడి) చేపట్టినప్పుడు హౌరా బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఉక్కుపాదం మోపారు. బాష్పవాయువు గోళాలు, వాటర్ కెనాన్లు ప్రయోగిస్తున్న ఆ భయానక వాతావరణంలో తెల్లటి గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు త్రివర్ణ పతాకాన్ని చేతబూని పోలీసులకు ఎదురునిలిచిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. శరీరానికి తూటాల్లా తగిలే వాటర్ కెనాన్ ధారలను లెక్కచేయకుండా ఆయన అచంచలంగా నిలబడ్డారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించింది. అది కేవలం ఒక ఫోటోగా కాకుండా, ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సామాన్యుడి ధిక్కారానికి చిహ్నంగా మారింది. భవిష్యత్తుపై ఆశలు కోల్పోతున్న బెంగాలీ యువతకు ఈ వృద్ధుడి ధైర్యం ఒక టానిక్‌లా పనిచేసింది.

మమత ప్రభుత్వానికి హెచ్చరిక గంటలు

ఈ ఘటన తరువాత ప్రజల్లో గూడుకట్టుకున్న భయం తొలిగిపోయింది. నిన్నటి వరకు మౌనంగా ఉన్న ప్రజలు ఇప్పుడు బహిరంగంగానే ప్రభుత్వ వైఫల్యాలను ఎండట్టారు. కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు, వ్యవస్థల దుర్వినియోగం వంటి అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చాంశాలుగా మారాయి. బెంగాల్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన పునాదులను పటిష్టం చేసుకోవడానికి ఈ వ్యతిరేకత ఒక ప్రధాన అస్త్రంగా మారింది. "ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉండే అత్యున్నత ఆయుధం ధైర్యం. ఆ వృద్ధుడు చూపిన తెగింపు అధికార పీఠాన్ని కదిలించే స్థాయికి చేరుకుంది." ఒక రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయపడ్డారు.

మార్పు అనివార్యమైంది.. మమతను గద్దెదించింది.

పశ్చిమ బెంగాల్ చరిత్రలో వీధుల నుంచే విప్లవాలు మొదలవుతాయి. నాడు మమతను అధికారంలోకి తెచ్చింది కూడా ఇటువంటి ప్రజా ఉద్యమాలే. కానీ నేడు అదే ప్రజలు, అదే వీధుల్లో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. బీజేపీని ఓడించారు.. హౌరా బ్రిడ్జ్ వద్ద ఆ వృద్ధుడు వేసిన అడుగు, బెంగాల్ ఎన్నికల్లో టర్నింగ్ పాయింట్గా మారి, మమతా బెనర్జీ పతనానికి నాంది పలుకుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ పోరాటం కేవలం ఓట్లు, సీట్ల కోసం కాకుండా, బెంగాల్ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటంగా రూపాంతరం చెందింది.




Tags:    

Similar News