జూబ్లీ గెలుపు... రేవంత్ రాజ‌కీయాల‌కు మ‌లుపు!

ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆదిత్యం ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయాన్ని నమోదు చేశారు.;

Update: 2025-11-14 10:40 GMT

జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆదిత్యం ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయాన్ని నమోదు చేశారు. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఇప్పుడు కీలకంగా మారిందన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత దాదాపు పది రోజులపాటు కాంగ్రెస్ చర్చల్లోనే మునిగిపోయింది. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు అధిష్టానం అనుమతి కోసం ఢిల్లీ చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక అప్పటికే బిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి దిగిపోవడం, అభ్యర్థిని ప్రకటించడం, బిఫారం కూడా ఇచ్చేయటం వెనువెంటనే ఒక ప్రణాళిక ప్రకారం జరిగి పోయాయి. దీంతో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకబడిన వాదన బలంగా వినిపించింది. ఇక ప్రచార సరళిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దూకుడుగా వ్యవహరించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చాలా బలంగా ప్రభుత్వంపై ఎదురు దాడి చేశారు. అదేవిధంగా గతంలో తాము అమలు చేసిన పథకాలను ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

అయిన‌ప్పటికీ చివరి నాలుగు రోజులు అంటే ఎన్నికల పోలింగ్ కు ముందు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీనిలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పాత్ర తిరుగులేదనే చెప్పాలి. బహిరంగంగా ప్రచారం చేయడంతో పాటు బహిరంగ సభల నిర్వహించారు. అదేవిధంగా మీడియా పాయింట్ల‌లో విస్తృతంగా ఆయన ప్రచారం చేశారు. ప‌లు ఛాన‌ళ్ల‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. తద్వారా అనూహ్యంగా చివరి నాలుగు రోజులు కాంగ్రెస్ పార్టీ పుంజుకుని బలమైన విజయాన్ని దక్కించుకునే విషయంలో రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించారు అన్నది రాజకీయ వ‌ర్గాలు చెబుతున్న మాట.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ విజయం ప్రత్యక్షంగా నవీన్ యాదవ్ కు దక్కితే పరోక్షంగా ఈ విజయం రేవంత్ రెడ్డికే దక్కుతుందని పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇప్పటివరకు మంత్రులు సహా పార్టీ నాయకుల్లో రేవంత్ రెడ్డి పై ఉన్న అనుమానాలు, అస‌హ‌నం, అసంతృప్తి వంటివి పటాపంచలు అవుతున్నాయి అన్నది విశ్లేషకుల మాట. ఒక విజయంతో రేవంత్ రెడ్డి పుంజుకున్నారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు ప్రభుత్వం పై ఉన్న అనుమానాలను అదేవిధంగా అసంతృప్తి అనే మాటను కూడా లేకుండా చేసిందన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News