మాచర్లలో హై టెన్షన్..టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

ఈ నేపథ్యంలోనే మాచర్ల వెళ్లకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో టిడిపి నేతలు నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Update: 2024-05-23 11:48 GMT

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు లోని ఓ పోలింగ్ బూత్ లో ఈవీఎంను మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది.

మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతల దాడిలో గాయపడిన టీడీపీ నేతలు, కార్యకర్తలను, బాధితులను పరామర్శించేందుకు మాచర్ల వెళ్లాలని టిడిపి నేతలు ‘చలో మాచర్ల’ కార్యక్రమానికి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మాచర్లలో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆల్రెడీ మే 13 నుంచి ఈ రోజు వరకు మాచర్లలో 144 సెక్షన్ ఉంది. దీంతో, మాచర్లలో ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని, చలో మాచర్ల కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మలికా గార్గ్ చెప్పారు.

ఈ నేపథ్యంలోనే మాచర్ల వెళ్లకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో టిడిపి నేతలు నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యలను గృహ నిర్బంధంలో ఉంచారు. మాచర్ల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలింగ్ మరుసటి రోజు నుంచి పోలీసులు హౌస్ అరెస్టులో ఉంచిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూలకంటి బ్రహ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో మాచర్ల వస్తానని పిన్నెల్లి సవాల్ విసిరాడని, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని జూలకంటి ఎద్దేవా చేశారు. రాష్ట్ర సరిహద్దుకు అటువైపు, ఇటువైపు పిన్నెల్లి పడిన తిప్పలు అన్ని ఇన్ని కావని సెటైర్లు వేశారు. పోలీసులు సహకారంతోనే పిన్నెల్లి పారిపోయాడని, ఒక ఎమ్మెల్యే గోడ దూకి పారిపోవడం కన్నా నీచం ఏముంటుందని చురకలంటించారు.

Tags:    

Similar News