హనీ ట్రాప్స్... హోం మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరికలు ఇవే!
ఈమేరకు తన అధికారిక వెబ్ పేజీ "వి చాట్ పోస్ట్" లో కొన్ని ఉదాహరణలతో సహా పౌరులకు కీలక హెచ్చరికలు జారీచేసింది.;
డైరెక్టుగా మేటర్ లోకి వెళ్లిపోతే చైనా దేశానికి సరికొత్త సమస్య వచ్చిపడింది. తమ ప్రభుత్వంలో పనిచేస్తున్న వారి హనీ ట్రాపులపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో... గతంలో ఇలా హనీ ట్రాప్ ల బారిన పడి దేశ రహస్యాలను ఇతర దేశాల గూఢచారులకు చెప్పాల్సిన పరిస్థితి తెచుకున్న వారి వివరాలకు ఉదాహరణలుగా చూపిస్తూ పౌరులకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఆ కంట్రీలో ఇదే హాట్ టాపిక్!
అవును... కొందరు విదేశీ గూఢచారులు అందమైన అమ్మాయిలుగా నటించి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఈ సమయంలో దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అందువల్ల అందాల కోసం తాపత్రయపడి కష్టాలు కొని తెచ్చుకోవద్దని చైనా చెబుతుంది. ఈమేరకు తన అధికారిక వెబ్ పేజీ "వి చాట్ పోస్ట్" లో కొన్ని ఉదాహరణలతో సహా పౌరులకు కీలక హెచ్చరికలు జారీచేసింది.
ఇందులో భాగంగా... "లిసి" అనే వ్యక్తి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనే జరిగిందంటూ ఆ స్టోరీ మొత్తం వెల్లడించింది చైనా. ఈ క్రమంలో... "చైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న లిసి కార్యకలాపాలపై గత కొన్నాళ్లుగా విదేశీ స్పై ఏజెంట్లు కన్నేసి ఉంచారు.. ఈ సమయంలో అతడి బలహీనతలను గ్రహించి తియ్యనైన మాటలతో వలలోకి దించారు.. అనంతరం తమ రప్పించుకున్నారు.. అక్కడ ఓ రోజు నైట్ క్లబ్ కు తీసుకెళ్లి.. దుస్తుల్లేకుండా ఫొటోలు తీశారు" అని రాసుకొచ్చింది.
అనంతరం అసలు కథ మొదలైంది.. ఆ దుస్తులు లేకుండా ఉన్న ఫోటోలను బయటపెడతామని బెదిరింపులకు దిగారు.. దీంతో లిసి తన ల్యాప్ ట్యాప్ ను వారికి ఇచ్చేశాడు. దీంతో... సుమారు 10 ఏళ్ల క్రితం నుంచి అతడు పని చేస్తున్న సంస్థకు చెందిన సమాచారం అందులో ఉండటంతో.. ఆ సమాచారం మొత్తాన్ని తెలుసుకున్నారు.. అయినా అది అక్కడితో ఆగలేదు" అని వివరించింది.
అనంతరం స్వదేశానికి వచ్చిన లిసి... ఇంకా ఆ బ్లాక్ మెయిల్ బాదితుడిగానే ఉన్నాడు. ఇందులో భాగంగా... స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా కీలక వివరాలను విదేశీ గూఢచారులకు చేరవేస్తూనే ఉన్నాడు.. ఈ సమయంలో అతడి కదలికలు, పనితీరుపై అనుమానం వచ్చి విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయాన్ని స్టేట్ సెక్యూరిటీ తెలిపింది" అని వెల్లడించింది.
ఇలా ఈ భారీ ఉదాహరణను చెప్పిన చైనా ప్రభుత్వం... తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో... దురాశ, కోపం, స్త్రీలపై విపరీతమైన మక్కువ వంటి బలహీనతలనే విదేశీ గూఢచారులు బలంగా మలచుకుంటారని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పౌరులను చైనా ఇంటెలిజెన్స్ సర్వీస్ అధికారి హెచ్చరించారు.