హిందీపై పీఛేముడ్..బడుల్లో కచ్చితం కాదు..పెద్ద రాష్ట్రం కీలక నిర్ణయం

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రి భాషా సూత్రం ప్రకారం విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే తమిళనాడు సర్కారు కుదరదు పొమ్మంది.;

Update: 2025-06-18 12:30 GMT
హిందీపై పీఛేముడ్..బడుల్లో కచ్చితం కాదు..పెద్ద రాష్ట్రం కీలక నిర్ణయం

హిందీ జాతీయ భాషనా..? ఆ మాటంటే కొన్ని రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తమిళనాడు అస్సలు ఒప్పుకోదు.. కస్సుమని లేస్తుంది..

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రి భాషా సూత్రం ప్రకారం విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తే తమిళనాడు సర్కారు కుదరదు పొమ్మంది. ఇలా ఓ పెద్ద సంఘర్షణే జరుగుతోండగా.. కొన్ని నెలల కిందట.. పాఠశాల పిల్లలందరికీ హిందీ తప్పనిసరిగా బోధించాలని దేశంలోని పెద్ద రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రంలో ఉన్నది వారి ప్రభుత్వమే కాబట్టి.. ఆ రాష్ట్రంలో స్థానిక భాష ఉన్నప్పటికీ హిందీని తప్పనిసరిగా బోధించాలని నిర్ణయం తీసుకుంది. కానీ, అక్కడా వ్యతిరేకత రావడంతో వెనక్కుతగ్గింది.

ఇదంతా మహారాష్ట్ర గురించి.. తాజాగా దేవేంద్ర ఫడణవీస్ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు హిందీని విధిగా బోధించాలన్న తమ నిర్ణయాన్ని వాపస్ తీసుకుంది. కొత్త నోటిఫికేషన్ లో.. ’’తప్పనిసరి’’ పదాన్ని తొలగించింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. హిందీకి బదులు మరో భాషను ఎంచుకోవచ్చని పేర్కొంది. ఈ ఫలానా భాష నేర్చుకోవాలనుకునే క్లాసులో కనీసం 20 మంది విద్యార్థులు ఉండాలని నిర్దేశించింది. అలాగైతేనే ఆ పాఠశాలలో సంబంధిత సబ్జెక్టు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సబ్జెక్ట్ టీచర్ లేకుంటే ఆన్ లైన్ ద్వారా అయినా పాఠాలు జరుగుతాయని తెలిపింది.

కాగా, కొత్త జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. హిందీ ఉండడమే ఇందుకు కారణం. తమది ద్విభాషా సూత్రమని చెబుతోంది. హిందీని రుద్దితే సహించబోమని పేర్కొంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం హిందీపై ముందుకెళ్లింది. దీనిని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే, శివసేన (ఉద్ధవ్) చీఫ్ ఉద్ధవ్ థాక్రే గట్టిగా

వ్యతిరేకించారు.

అసలే మరాఠీ యోధులు. ఆపై థాక్రేలు హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనేందుకు ఏకం కానున్నట్లుగా సమాచారం అందడంతో ఫడణవీస్ ప్రభుత్వం పీఛేముఢ్ అని నిర్ణయం వెనక్కు తీసుకుంది.

Tags:    

Similar News