ఆపరేషన్ సింధూర్: కశ్మీరీ ముస్లిం హిలాల్ అహ్మద్ కీలక పాత్ర

ఎయిర్ వైస్ మార్షల్ హిలాల్ అహ్మద్ రఫేల్ జెట్ల ఆపరేటింగ్‌లో విశేష అనుభవం కలిగిన అధికారి.;

Update: 2025-05-08 05:25 GMT

భారత వైమానిక దళం (IAF) తాజాగా నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్'లో అనంతనాగ్‌కు చెందిన కశ్మీరీ ముస్లిం అధికారి ఎయిర్ వైస్ మార్షల్ హిలాల్ అహ్మద్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన రఫేల్ జెట్లతో మెరుపుదాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో హిలాల్ అహ్మద్ అనుభవం, నైపుణ్యం ఎంతో ఉపయోగపడినట్లు కథనాలు వస్తున్నాయి.

ఎయిర్ వైస్ మార్షల్ హిలాల్ అహ్మద్ రఫేల్ జెట్ల ఆపరేటింగ్‌లో విశేష అనుభవం కలిగిన అధికారి. రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశానికి తీసుకురావడంలో.. దేశ వైమానిక రక్షణను బలోపేతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా రఫేల్ జెట్‌ను నడిపిన తొలి భారతీయ పైలెట్ ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్ల కొనుగోలు ప్రక్రియ, వాటికి అవసరమైన ఆయుధాల అమరిక.. వాటిని భారత వాయుసేన అవసరాలకు అనుగుణంగా మార్చడంలో హిలాల్ అహ్మద్ చేసిన కృషి ప్రశంసనీయం.

ఇటీవల పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై IAF జరిపిన దాడికి రఫేల్ జెట్లను ఉపయోగించిన నేపథ్యంలో ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో ఎయిర్ వైస్ మార్షల్ హిలాల్ అహ్మద్‌కున్న రఫేల్ సాంకేతిక పరిజ్ఞానం.. వ్యూహాత్మక అనుభవం పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా దోహదపడి ఉంటుందని భావిస్తున్నారు. ఆయన నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ, రఫేల్ విమానాల కార్యాచరణ సంసిద్ధత.. ప్రణాళికలో ఆయన మార్గదర్శకత్వం ఆపరేషన్ సింధూర్‌కు బలం చేకూర్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కశ్మీర్‌లోని అనంతనాగ్ ప్రాంతానికి చెందిన హిలాల్ అహ్మద్ భారత వైమానిక దళంలో ఉన్నత స్థానానికి ఎదిగి, దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషించడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. మతంతో సంబంధం లేకుండా దేశ సేవకు అంకితమైన ఆయన వంటి అధికారులు భారత సైన్యానికి గర్వకారణం. 'ఆపరేషన్ సింధూర్'లో ఆయన పాత్ర గురించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడనప్పటికీ, రఫేల్ జెట్లతో ఆయనకున్న అనుబంధం.. ఆపరేషన్‌లో రఫేల్ వినియోగం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Tags:    

Similar News