హైదరాబాద్ ను ఆగంమాగం చేసిన వాన తీవ్రత ఎంతంటే?

అప్పటివరకు ఎండతో సుర్రుమంటే.. సాయంత్రం కురిసిన వానకు గజగజ వణికిపోయిన పరిస్థితి.

Update: 2024-05-08 04:42 GMT

మంటలు పుట్టించిన ఎండలకు కాస్తంత ఉపశమనంగా ఉంటుందని భావించిన వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తింది. అప్పటివరకు ఎండ తాకిడికి విలవిలలాడిన నగర జీవులకు ఉపశమనం కలిగిస్తూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వేళకు వాతావరణం చల్లబడింది. దీంతో.. కాస్తంత కుదురుకున్న ప్రజలకు ఒక్కసారిగా మొదలైన ఈదురుగాలి.. వర్షంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. అప్పటివరకు ఎండతో సుర్రుమంటే.. సాయంత్రం కురిసిన వానకు గజగజ వణికిపోయిన పరిస్థితి.

దాదాపు రెండు వారాలుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలకు కాస్తంత విరామం ఇస్తూ వరుణుడు వస్తాడంటూ వాతావరణ శాఖ ముందస్తు అంచనాల్ని వెల్లడించింది. ఈ వేసవి తీవ్రతతో భూగర్భ జలాలు అడుగండటం.. ఇళ్లు నిప్పుల కొలిమిగా మారిన వేళ.. వర్షంతో కాస్త రిలాక్స్ కావొచ్చనుకుంటే.. మాయదారి వాన ముంచెత్తి కొత్త కష్టాల్ని తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినప్పటికీ.. హైదరాబాద్ మహానగరంలో దీని తీవ్రత ఎక్కువ. భాగ్యనగరిలో కురిసిన భారీ వర్షంతో కోటి మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

Read more!

హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మియాపూర్ లో 13.3 సెంటీమీటర్లు.. కూకట్ పల్లిలో 11.2 సెంటీమీటర్లు.. సికింద్రాబాద్ లో 10 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం కురిసింది. అది కూడా రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వాన.. దీనికి తోడుగా పెద్ద ఎత్తున గాలులు వీయటంతో పలు పైకప్పులు.. ఫ్లెక్సీలు.. రేకులు కొట్టుకుపోయిన పరిస్థితి.

భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్లు ట్రిప్ కావటంతో విద్యుత్ సరఫరాకు గంటల కొద్దీ సమయం తీసుకుంది. రోడ్ల మీద నిలిచిన వర్షపు నీటితో ట్రాఫిక్ జాం నెలకొంది. దీంతో.. గంటల కొద్దీ సమయం రోడ్ల మీదే గడిచిపోయిన పరిస్థితి. సాయంత్రం నాలుగు గంటలకు ఇళ్ల నుంచి ఈవినింగ్ షిఫ్టు కోసం బయలుదేరిన వారు.. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఆఫీసులకు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు షిఫ్టు అయిన వారు ఇంటికి చేరుకునేసరికి ఎనిమిదికి పైనే దాటింది. అర్థరాత్రి పన్నెండు గంటల వరకు ఐటీ నగరిలో ట్రాఫిక్ జాం నెలకొని ఉండటం గమనార్హం.

మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో దేవేందర్ కాలనీకి చెందిన గంగాధరరావు.. సుబ్రమణ్యం ఇద్దరు గోడకు ప్లాస్టరింగ్ చేస్తూ వర్షం కారణంగా పక్కన నిలుచున్నారు. గోడ కూలిన ప్రమాదంలో ఈ ఇద్దరు మరణించారు. బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఒకకార్మికుడు మరణించారు. పాతబస్తీ పరిధిలోని బహదూర్ పురలో విద్యుద్ఘాతంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పది మంది మరణించారు. హైదరాబాద్ లోని పలు కాలనీలు జలమయం కావటంతో పాటు.. అక్రమ నిర్మాణాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో.. పలుచోట్ల కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి. మొత్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదిలా ఉంటే.. మేలో కురిసిన వర్షాల కారణంగా రైతులు పండించిన పంట భారీగా తడిచిపోయింది. తీవ్రమైన గాలుల కారణంగా మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. జొన్న.. వేరుసెనగ.. మొక్కజొన్న.. మినుములతో పాటు పలు పంటలు దెబ్బ తిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొద్దీ ధాన్యం కొట్టుకుపోవటంతో రైతులు తల్లడిల్లారు.

Tags:    

Similar News