బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షాలు.. మునిగిన టెక్ పార్క్.. వైరల్ వీడియో
పదేళ్లలో మే నెలలో ఈ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.;
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడం, తీరం వైపు కదలడం వంటి కారణాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిలికాన్ సిటీ బెంగళూరు ఈ వర్షాల ధాటికి అతలాకుతలం అవుతోంది. గత నాలుగైదు రోజులుగా సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు బెంగళూరును పలకరిస్తుండగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన కుండపోత వర్షం నగరాన్ని పూర్తిగా నీట ముంచింది.
పదేళ్లలో మే నెలలో ఈ స్థాయిలో భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున 6 గంటల వరకు బెంగళూరు దక్షిణ ప్రాంతంలోని కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చామరాజనగర- 130, ఎన్ఎండీసీ క్యాంపస్- 125.8, సోమశెట్టిహళ్లి- 119.5, మాదనాయకనహళ్లి-116.5, యలహంక చౌడేశ్వరి- 103.5 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. కొడిగేహళ్లి- 100, కోరమంగళ- 96, హెచ్ఏఎల్- 93, మార్థహళ్లి- 92, రాజరాజేశ్వరి నగర- 80, హెచ్ఎస్ఆర్ లే అవుట్- 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డ్ వంటి పలు ప్రాంతాలు నీట మునిగాయి.
ఈ భారీ వర్షాల ప్రభావంతో దేశంలోనే అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యత టెక్ పార్క్ పూర్తిగా నీట మునిగిపోయింది. 300 ఎకరాల్లో విస్తరించిన ఈ టెక్ పార్క్ లో అనేక ఐటీ కంపెనీల కార్యాలయాలున్నాయి. వేలాది మంది ఉద్యోగులు పనిచేసే ఈ ప్రాంతం, హెబ్బాళ- కృష్ణరాజపురం రద్దీ మార్గంలో ఉంది. వర్షపునీరు టెక్ పార్క్ ప్రాంగణంలోకి భారీగా చేరడంతో సోమవారం కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులకు పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించినట్లు సమాచారం.
నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈజీపురాలో ఇళ్లలోకి నీరు చేరగా, హెణ్ణూర్ అండర్ పాస్ లో వరదనీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతినగర బీఎంటీసీ బస్ డిపోలో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోవడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బెంగళూరులో నెలకొన్న ఈ పరిస్థితి సాధారణ జనజీవనంతో పాటు, ఐటీ రంగ కార్యకలాపాలపైనా తీవ్ర ప్రభావం చూపింది.