33 ఏళ్లకే రెండోసారి ఎంపీ అభ్యర్థి... ఎవరీ హరీష్ మాధుర్?

ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో అతి పిన్న వయస్కుడి పేరు తెరపైకి వచ్చింది.

Update: 2024-03-29 05:22 GMT

పొత్తులో భాగంగా మిగిలిన 144 అసెంబ్లీ 17 లోక్ సభ స్థానాలలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీలైనంత క్షుణ్ణంగా సర్వేలు చేయించి.. గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఈ సమయంలో ఎదురయ్యే అసంతృప్తులను తనదైన శైలిలో బుజ్జగిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో అతి పిన్న వయస్కుడి పేరు తెరపైకి వచ్చింది.

అవును... రానున్న ఎన్నికల్లో కూటమిలో భాగంగా అమలాపురం లోక్ సభ స్థానం టీడీపీకి దక్కింది. దీంతో... అక్కడ అభ్యర్థిని ఫిక్స్ చేశారు చంద్రబాబు. ఇందులో భాగంగా... గంటి హరీశ్ మాధుర్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆయన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పారు. ఈయన వయసు ప్రస్తుతం 33 ఏళ్లు కావడం గమనార్హం. ఇంత చిన్న వయసులోనే మాధుర్... లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

12వ లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడే ఈ హరీష్ మాధుర్. ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో గంటి మోహన్ చంద్ర బాలయోగి కి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి. రాజకీయంగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ఎదుర్లంక నుంచి లోక్ సభ స్పీకర్ స్థాయి వరకూ ఎదిగారు. కోనసీమ ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ధే.. ఇప్పటికీ చెప్పుకునే స్థాయి అభివృద్ధి అని చెప్పినా అతిశయోక్తి కాదు!

Read more!

1991లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరుపున అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన జీఎంసీ బాలయోగి.. కోనసీమ ప్రాంతాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేశారనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న రహదారులు, గోదావరి నదిపై ఆయన కట్టిన వంతెనలు ఆయనను కోనసీమ ప్రజలకు నిత్యం గుర్తుచేస్తుంటాయి. ఈ క్రమంలో 2002 మార్చిలో ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి విజయ కుమారి అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు.

ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో వీరి కుమారుడు హరీష్ మాధుర్ పోటీ చేయనున్నారు. ఇంతకంటే చిన్న వయసులో (2019) లోనే తొలిసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు హరీష్ . 2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన హరీష్ మాధుర్... కేవలం 39,966 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతా అనురాధకు 4,85,313 ఓట్లు పోలవ్వగా.. హరీష్ మాధుర్ కి 4,45,347 ఓట్లు వచ్చాయి.

బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ హరీష్ మాధుర్... 2024 ఎన్నికల్లోనూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నుంచి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News