తండ్రిని మరిపించేలా అడుగులు.. టీడీపీ యువ ఎంపీకి పదవి రెడీ?

అమలాపురం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన గంటి హరీష్ మాధుర్ తన పనితీరుతో కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పిస్తున్నారని చెబుతున్నారు.;

Update: 2025-07-16 19:30 GMT

గత పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలిచిన టీడీపీ.. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. మంత్రివర్గంలో రెండు పదవులను తీసుకోవడంతోపాటు కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా తీసుకుంటుందని ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో ఏమైందో కానీ, ఆ రెండు పదవులు టీడీపీకి దక్కలేదు. కానీ, డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పటికీ ఖాళీగా ఉంది. దీంతో ఈ పదవిని టీడీపీలో ఓ యువ పార్లమెంటు సభ్యుడికి కట్టబెడతారని తాజాగా ప్రచారం జరుగుతోంది.

అమలాపురం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన గంటి హరీష్ మాధుర్ తన పనితీరుతో కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పిస్తున్నారని చెబుతున్నారు. ఎంపీ హరీశ్ మాధుర్ తండ్రి గతంలో లోక్ సభ స్పీకరుగా పనిచేశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన దురదుష్టవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. స్పీకర్ గా బాలయోగి రెండు సార్లు పనిచేయగా, ఆయన మరణానంతరం దాదాపు 23 ఏళ్లు అమలాపురం సీటు ఆ కుటుంబానికి దూరమైంది. 2014లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన హరీశ్ మాధుర్ తొలిసారి ఓటమి చెందగా, 2024 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించారు.

ఇక ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తారని, డిప్యూటీ స్పీకర్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఏ అవకాశం దక్కకపోయినా ఎంపీగా సమర్థంగా పనిచేస్తూ అటు కేంద్ర పెద్దల వద్ద, ఇటు సొంత పార్టీలోనూ గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించడం, వివాదాలకు దూరంగా ఉండటం, విమర్శలపైనా తగిన సమయంలో స్పందిస్తూ సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఎంపీ హరీశ్ మాధుర్ అందర్నీ ఆకట్టుకుంటున్నారని అంటున్నారు.

ఢిల్లీ పాలిటిక్స్‌లోనూ అనుభ‌వం గ‌డిస్తున్న ఎంపీ హరీశ్ మాధుర్ నియోజ‌క‌వ‌ర్గ స‌మస్య‌ల‌ను ఆక‌ళింపు చేసుకుంటూ ప్రజలకు చేరువ అవుతున్నట్లు ప్రశంసలు అందుకుంటున్నారు. గ‌తంలో ఆయన తండ్రి జీఎంసీ బాల‌యోగి ఏవిధంగా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారో ఇప్పుడు అచ్చం అలానే హరీశ్ పనిచేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్రచారం చేయడం, తన పరిధిలోి ఎమ్మెల్యేల‌తో క‌లిసి సాగడంలోనూ హరీశ్ భేష్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక టీడీపీ యువనేత నారా లోకేష్ టీంలో స‌భ్యుడిగా క్రియాశీలంగా పనిచేస్తుండటం వల్ల ఆయనకు త్వరలో పదవీ యోగం ఉందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News