తెరపైకి 48వ వర్గం బ్లడ్ గ్రూప్... ఏమిటీ 'గ్వాడా నెగిటివ'?
అవును... శాస్తవేత్తలు తాజాగా ఒక కొత్త బ్లడ్ గ్రూప్ ను గుర్తించారు. ఫ్రెంచ్ మహిళలో ఈ కొత్త రకం రక్త వర్గాన్ని గుర్తించారు.;
సాధారణంగా ఏ, బీ, ఏబీ, ఓ రకాల బ్లడ్ గ్రూప్స్ ని మాత్రమే ఎక్కువగా చూసే ప్రపంచంలో సరికొత్త రక్త వర్గం తెరపైకి వచ్చింది. సుమారు 15 సంవత్సరాల పరిశోధన తర్వాత ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు 48వ రక్త గ్రూపు వ్యవస్థను కనుగొన్నారు. ఈ కొత్త రక్త వర్గానికి "గ్వాడా నెగిటివ్" అని నామకరణం చేశారు. ఈ పేరు దాని మూలం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుందని అంటున్నారు.
అవును... శాస్తవేత్తలు తాజాగా ఒక కొత్త బ్లడ్ గ్రూప్ ను గుర్తించారు. ఫ్రెంచ్ మహిళలో ఈ కొత్త రకం రక్త వర్గాన్ని గుర్తించారు. ఆపరేషన్ కు ముందు చేసే రెగ్యులర్ పరీక్షల కోసం ఆమె రక్తనమూనాలను సేకరించి, పరీక్షించగా.. అందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త వ్యత్యాసాలు కనిపించాయని అంటున్నారు. ఇదంతా తొలుత 2011లోనే ప్రారంభమైంది.
వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాన్స్ దేశంలోని గ్వాడెలోప్ ప్రాంతానికి చెందిన మహిళ, పారిస్ లో నివసిస్తుంది. 2011లో ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వెళ్లిన 54 ఏళ్ల మహిళకు సాధారణ వైద్యపరీక్షల కోసం బ్లడ్ తీశారు. ఆ బ్లడ్ శాంపుల్స్ ని పరీక్షించిన వైద్యులకు అది అసాధారణంగా కనిపించింది. ఈ బ్లడ్ గ్రూప్, ఇతర సాధారణ బ్లడ్ గ్రూప్స్ తో ఏమాత్రం సరిపోలడం లేదు.
అదేవిధంగా... ఈ రక్త వర్గంలోని యాంటీ బాడీస్ ఏ రక్తవర్గంలోనూ ఇప్పటి వరకు గుర్తించలేదు. దీంతో... ఈ అసాధారణ రక్త వర్గాన్ని గుర్తించిన వైద్యులు.. పరిశోధనల కోసం బ్లడ్ శాంపిల్స్ ను సేవ్ చేసి పెట్టారు. ఈ క్రమంలో ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ సుమారు 8 ఏళ్లపాటు ఎలాంటి ఫలితం రాలేదు. అయితే.. 2019లో మళ్లీ పరిశోధన ప్రారంభించారు.
అప్పటికి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో, దాని సహాయంతో పరిశోధన మళ్లీ ప్రారంభించారు. ఇందులో భాగంగా... హై క్వాలిటీ థ్రోపుట్ డీ.ఎన్.ఏ సీక్వెన్సింగ్ సహాయంతో శాస్త్రవేత్తలు మళ్లీ రీసెర్చ్ మొదలుపెట్టారు. ఈ సమయంలో... ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న బ్లడ్ గ్రూప్స్ లో లేనటువంటి కొత్తరకం జెనిటిక్ మ్యుటేషన్ ను ఇందులో గుర్తించారు.
ఈ సందర్భంగా... సదరు మహిళ పేరెంట్స్ ఇద్దరూ అరుదైన జన్యువులను కలిగి ఉన్నారని.. ఆ అరుదైన జన్యువులే ఆమెకు వచ్చాయని.. ఈ క్రమంలో జెనిటిక్ మ్యూటేషన్ వల్ల అరుదైన రక్తవర్గం వచ్చిందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ సందర్భంగా దీనికి 'గ్వాడా నెగిటివ్' అని నామకరణం చేశారు.
కాగా... ప్రపంచంలో ఇప్పటి వరకు మొత్తం 47 రకాల బ్లడ్ గ్రూప్స్ ను అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు 48వ రకం బ్లడ్ గ్రూప్ ను గుర్తించారు. ఈ మేరకు ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్ మెంట్.. 48వ రక్తవర్గాన్ని గురించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఈ బ్లడ్ గ్రూప్ కు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ (ఐ.ఎస్.బీ.టీ) గుర్తింపు లభించింది.