గుంటూరు కలెక్టరేట్ కు వచ్చిన 8 ఏళ్ల పిల్లాడు.. కారణం తెలిస్తే అయ్యో అనాల్సిందే
రోటీన్ కు భిన్నంగా కనిపించిన ఈ పిల్లాడిని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వద్దకు తీసుకెళ్లారు. ఆ పిల్లాడు ఆమెకు ఒక వినతిపత్రాన్ని అందించారు.;
కొన్నిసార్లు అనూహ్య ఉదంతాలు మీడియా ద్వారా వెలుగు చూస్తుంటాయి. మనసును కదిలించే ఇలాంటి ఉదంతాలపై అధికారంలో ఉన్న వారు తక్షణం స్పందిస్తే.. ఆ లెక్కనే వేరు ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే గుంటూరులో చోటు చేసుకుంది. సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎనిమిదేళ్ల బాలుడు (యశ్వంత్) ఒకరు చేతిలో పేపరు (అర్జీ పత్రం) పట్టుకొని వచ్చాడు. రోటీన్ కు భిన్నంగా కనిపించిన ఈ పిల్లాడిని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వద్దకు తీసుకెళ్లారు. ఆ పిల్లాడు ఆమెకు ఒక వినతిపత్రాన్ని అందించారు.
తన తల్లి అందరం కలిసి చనిపోవాలని అంటోందని.. అందుకే అధికారుల్ని కలిసేందుకు వచ్చినట్లు చెప్పాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గేటు వద్ద గతంలో తన తల్లి రాధిక టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించేదని.. రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఇటీవల అక్కడి బండిని తొలగించారని.. తాము జీవనోపాధి కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. ఆసుపత్రి బయట ఎక్కడైనా బండి పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వాలని అధికారుల్ని కోరితే.. ఎలాంటి స్పందన లేదని.. అందుకే ఇంట్లో వాళ్లంతా కలిసి చనిపోదామని అనుకుంటున్నారని.. అందుకు తాను కలెక్టరేట్ కు వచ్చినట్లుగా ఆ బాలుడు పేర్కొన్నాడు.
తనకు గుండె సంబంధిత సమస్య ఉందని.. తమ టిఫిన్ బండిని కాలువలో పడేసినట్లుగా పేర్కొన్న పిల్లాడి మాటలకు కలెక్టర్ స్పందించారు. వెంటనే.. నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. బాలుడి కుటుంబానికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తన వద్దకు వచ్చిన వినతిని గుంటూరు జిల్లా కలెక్టర్ సానుకూలంగానే స్పందించినా.. ఇలాంటి ప్రత్యేక ఉదంతాలపై మంత్రి నారా లోకేశ్ రియాక్టు కావాల్సిన అవసరం ఉంది. వెంటనే.. యశ్వంత్ కుటుంబానికి అండగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపడితే బాగుంటుందని అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు పప్పు అని ఎటకారం చేసే వేళలో.. తాను పప్పు కాదు ఫైర్ అన్న విషయాన్ని చాటేలా.. స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. లోకేశ్ వరకు ఈ ఉదంతం వెళుతుందో.. లేదో చూడాలి.