బీహార్ ఉత్కంఠ‌: తుపాకీ వ‌ర్సెస్ ల్యాప్‌టాప్‌.. రాత్రికి రాత్రి మారిన సీన్‌!

ఇంత‌కీ మోడీ ఏమ‌న్నారంటే.. ``ఈ ఎన్నిక‌లు.. తుపాకుల‌కు-ల్యాప్‌టాప్‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరు. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే.. మీ పిల్ల‌ల‌కు తుపాకులు ఇస్తుంది.;

Update: 2025-11-09 05:37 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు కీల‌క మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ఠ్ బంధ‌న్ వ‌ర్సెస్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌ముల మ‌ధ్య అనేక మాట‌ల తూటాలు పేలాయి. అధి కార ఎన్డీయే కూట‌మి అభివృద్ధి మంత్రం పఠించగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ఠ్‌బంధ‌న్‌.. రాష్ట్రం లో అవినీతి.. మోడీ దుబారా.. సీఎం నితీష్ కుమార్ వ‌య‌సు, ఆయ‌న ఆరోగ్య అంశాల‌ను అస్త్రాలుగా చేసు కుంది.

అయితే.. ఎంతైనా రాజ‌కీయాల్లో ఒక క్ష‌ణం ఉన్న వ్యూహం మ‌రో క్ష‌ణానికి మారుతుంది. ఇలానే బీహార్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ ఎంట్రీతో ఎన్డీయే రాజ‌కీయ వ్యూహం స‌మూలంగా మారిపోయింది. నిన్న టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఒక ఎత్తు అయితే.. తాజాగా మోడీ ఇచ్చిన‌నినాదం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే మంత్రందండం లాంటి హామీలు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను.. ముఖ్యంగా అధికా రం ద‌క్కించుకోక‌పోతే.. ప‌రిస్థితి ఇబ్బందేన‌ని భావిస్తున్న‌ ఆర్జేడీకి ప్రాణ సంక‌టంగా మారిపోయింది.

ఇంత‌కీ మోడీ ఏమ‌న్నారంటే.. ``ఈ ఎన్నిక‌లు.. తుపాకుల‌కు-ల్యాప్‌టాప్‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరు. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే.. మీ పిల్ల‌ల‌కు తుపాకులు ఇస్తుంది. మేం(ఎన్డీయే) మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే.. మీ పిల్ల‌ల‌కు ల్యాప్‌టాపులు, స్కూలు బ్యాగులు, పుస్త‌కాలు, క్రికెట్ బ్యాటులు ఇస్తాం. మీ యువ‌త‌కు.. స్టార్ట‌ప్‌ల క‌ల నెర‌వేరుస్తాం. తేల్చుకోండి.. తుపాకుల పార్టీ కావాలా.. ల్యాప్ టాప్ ప్ర‌భుత్వం కావాలా?`` అని నిన‌దించారు. ఈ ప్ర‌భావం కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ఠ్ బంధ‌న్‌ ఎన్నిక‌ల వ్యూహాల‌ను తారు మారు చేసింద‌న్న చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది.

ఆఖ‌రి నిముషంలో ప్ర‌జ‌ల మైండ్ సెట్‌ను మార్చేసేలా ప్ర‌ధాని మోడీ చేసిన నినాదం.. ఇప్పుడు ఎన్డీయే నాయ‌కులకు వ‌రంగా కూడా మారింది. దీనిని వారు ఇంటింటికీ ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రోవైపు.. దీనిని తిప్పికొట్ట‌లేని ప‌రిస్థితి కాంగ్రెస్ స‌హా ఆర్జేడీల‌కు ఏర్ప‌డింది. ఎందుకంటే.. అన్యాయాలు, అక్ర‌మాలు ఎదుర్కొనేందుకు.. మీ పిల్ల‌ల‌కు.. తుపాకులు ఇస్తామ‌ని ఆర్జేడీ నాయ‌కులు ఇద్ద‌రు చేసిన వ్యాఖ్య‌లు.. వైర‌ల్‌గా మారాయి. బీజేపీ ఈ వీడియోల‌ను.. భారీ ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసింది. ఫ‌లితంగా ఇప్ప‌టి వ‌ర‌కు జరిగిన ప్ర‌చారం మొత్తం రాత్రికి రాత్రి యూట‌ర్న్ తీసుకుంద‌న్న చ‌ర్చ కూడా వినిపిస్తోంది. మ‌రి బీహార్ ఓట‌రు ఎటు మొగ్గుతాడో చూడాలి.

Tags:    

Similar News