ఇంటి పేరు లేదని విమానం ఎక్కించలేదు… చివరికి ఎయిర్‌లైన్‌కి జరిమానా!
నిజాముద్దీన్ తరపున వాదనలు వినిపిస్తూ, తన పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి మాస్కో ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని తెలిపారు.;
పాస్‌పోర్ట్‌లో ఇంటిపేరు (Surname) లేకపోవడాన్ని కారణంగా చూపి, ఓ ప్రయాణికుడిని విమానంలో ఎక్కనివ్వకుండా అడ్డుకున్న గల్ఫ్ ఎయిర్ ఎయిర్‌లైన్స్‌కు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రయాణికుడి న్యాయపోరాటం తర్వాత... చెన్నై వినియోగదారుల కమిషన్ ఎయిర్‌లైన్‌పై రూ. 1.4 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది అయిన నిజాముద్దీన్ 2023, ఫిబ్రవరి 9న మాస్కో నుంచి దుబాయ్‌లో జరగబోయే అత్యవసర సమావేశానికి వెళ్ళేందుకు గల్ఫ్ ఎయిర్ టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆయన పాస్‌పోర్ట్‌లో “సింగిల్ నేమ్” (ఒకే పేరు) మాత్రమే ఉంది, ఇంటి పేరు లేదు. మాస్కో ఎయిర్‌పోర్టులో గల్ఫ్ ఎయిర్ సిబ్బంది ఈ కారణాన్ని చూపి ఆయనకు బోర్డింగ్ నిరాకరించారు.
సమావేశం ప్రాముఖ్యత గురించి నిజాముద్దీన్ సిబ్బందికి వివరించినా వారు పట్టించుకోలేదు. దాదాపు గంటన్నర పాటు వేచి ఉండేలా చేసి, చివరకు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఆయన గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు. దీని వలన ఆర్థిక నష్టం, ముఖ్యంగా తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని ఆయన వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిజాముద్దీన్ తరపున వాదనలు వినిపిస్తూ, తన పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి మాస్కో ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని తెలిపారు. అయినప్పటికీ మాస్కో ఎయిర్‌పోర్టులో అదే పాస్‌పోర్ట్‌ను గల్ఫ్ ఎయిర్ తిరస్కరించడం పూర్తిగా అన్యాయమని వాదించారు.
ఈ కేసును విచారించిన చెన్నై వినియోగదారుల కమిషన్, గల్ఫ్ ఎయిర్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మరియు ప్రయాణికుడి హక్కులను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఫలితంగా, ఎయిర్‌లైన్స్‌పై రూ.1.4 లక్షల పరిహారం విధించింది.
ఈ పరిహారంలో టికెట్ ఖర్చు, సేవల్లో లోపం, ఆర్థిక నష్టం, మానసిక వేదనకు సంబంధించిన మొత్తం చేర్చబడింది. అంతేకాక ప్రయాణ తేదీ నుంచి ఈ మొత్తంపై 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
ఈ తీర్పుతో పాస్‌పోర్ట్ వివరాలపై విమాన సంస్థలు అనుసరించే కఠిన వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. కేవలం “ఇంటి పేరు లేకపోవడం” వల్ల అంతర్జాతీయ ప్రయాణ హక్కును నిరాకరించడం న్యాయబద్ధమేనా అనే ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి.