'అత్యాచారం జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే'... వివాదాస్పద పోస్టర్ల కలకలం!
ఈ క్రమంలో గుజరాత్ లో అలాంటి ఓ సూచన పోస్టర్ల రూపంలో రోడ్డు పై వెలిసింది. ఇది తీవ్ర కలకలం రేపింది.;
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారు వేసుకున్న దుస్తులు, నైట్ పార్టీలు, వారి ప్రవర్తనే కారణం అంటూ కొంతమంది తరచూ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుంటున్న సంగతి తెలిసిందే! మారాల్సింది వారి దుస్తులు కాదు, మృగాడి బుద్ది అని తెలుసుకోలేకపోతుంటారు. ఈ క్రమంలో గుజరాత్ లో అలాంటి ఓ సూచన పోస్టర్ల రూపంలో రోడ్డు పై వెలిసింది. ఇది తీవ్ర కలకలం రేపింది.
అవును... గుజరాత్ కు చెందిన ఓ ఎంజీవో.. 'మహిళల భద్రత' అంశంపై పోస్టర్లను రూపొందించి.. వాటిని నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసింది. అందులో 'అత్యాచారం జరగకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండండి'.. 'లేట్ నైట్ పార్టీలకు వెళ్తే గ్యాంగ్ రేప్ లు జరగొచ్చు' అని పోస్టర్లపై పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉంది. దీంతో.. ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది.
పైగా... అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పాన్సర్ చేసినట్లు ఉండడంతో ఈ వ్యవహారంపై పలువురు ప్రజలు, మహిళా సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో గుజరాత్ లోని పలు ప్రాంతాలలో డివైడర్లపై ఏర్పాటుచేసిన ఈ వివాదాస్పద పోస్టర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు.
ఇందులో భాగంగా... ట్రాఫిక్ వెస్ట్ డీసీపీ నీతా దేశాయ్ మాట్లాడుతూ.. సిటీ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను స్పాన్సర్ చేశారని, మహిళల భద్రతకు సంబంధించిన పోస్టర్లను కాదని స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని పోస్టర్లను తొలగించినట్లు పేర్కొన్నారు!
ఇదే సమయంలో.. వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించడానికి పోస్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి సతర్కత గ్రూప్ కు అనుమతి ఇచ్చామని.. అయితే, అందుకు విరుద్ధంగా ఆ సంస్థ లైంగిక వేధింపులపై పోస్టర్లు పెట్టిందని అడిషనల్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) ఎన్.ఎన్. చౌదరి స్పష్టం చేశారు. అలాంటి భాషను తాము ఎప్పుడూ ఆమోదించలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై గుజరాత్ ఆప్ నాయకులు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... ఈ పోస్టర్లు రాష్ట్రంలో మహిళల భద్రత స్థితిని బయటపెట్టాయని అన్నారు. ఇదే క్రమంలో... గత మూడు సంవత్సరాలలో గుజరాత్ లో 6,500 కంటే ఎక్కువ అత్యాచార సంఘటనలు, 36 కంటే ఎక్కువ సామూహిక అత్యాచారాలు జరిగాయని విమర్శించారు.