గుడివాడ 'మంత్లీ మేకప్పులు' సెటైర్లు బూమరాంగ్ అవుతున్నాయా ?

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయని చర్చ సాగుతోంది.

Update: 2026-06-16 03:49 GMT

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయని చర్చ సాగుతోంది. తాజాగా ఆయన తాను వైసీపీ తరఫున ఇంచార్జిగా ఉన్న చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి వెన్నుపోటుకు రెండేళ్ళు పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హోం మంత్రి వంగలపూడి అనిత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఇపుడు టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. గుడివాడ అనిత పనితీరు మీద విమర్శలు చేస్తే ఓకే కానీ వ్యక్తిగతంగా నిందిస్తారా అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

మేకప్పుల మంత్రి అంటూ :

అనితను మేకప్పుల మంత్రి అని అంటూ గుడివాడ సెటైర్లు వేశారు. ఆమె పేరు ఎవరో చెప్పను మీ అందరికీ తెలుసు అని అంటూ ఆయన తన ప్రసంగంలో కామెంట్స్ చేశారు. తాను మంత్రిగా పనిచేసినపుడు వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారులో మంత్రి తిరుగుతున్నారు అని అన్నారు. ఇలా చాలానే ఆమె మీద మాజీ మంత్రి కామెంట్స్ చేశారు. ఇపుడు అవే జిల్లాలో అగ్గి రాజేస్తున్నాయి. మాజీ మంత్రి గుడివాడ క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు అంతా మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నారు.

మహిళల మీదనా అంటూ :

ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే మహిళలు రాజకీయాల్లోకి రావాలని అంతా కోరుకుంటారని అలాంటి వారి విషయంలో ఈ తరహా కామెంట్స్ ఏంటి అని నిలదీశారు. అణగారిన వర్గాలకు చెందిన మహిళల విషయంలో ఇలాగే వైసీపీ వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. మహిళల వస్త్రధారణ అలంకరణల విషయంలో వైసీపీకి వచ్చిన అభ్యంతరం ఏమిటని కూడా నిలదీశారు. మరో వైపు వైసీపీ మహిళా నేతలు గుడివాడ కామెంట్స్ ని సమర్ధిస్తూ అనిత వైసీపీ అగ్ర నేతల మీద చేస్తున్న కామెంట్స్ ని గుర్తు చేస్తున్నారు.

దూకుడుతోనేనా :

గుడివాడ అమర్నాథ్ దూకుడుగా రాజకీయం చేస్తారు. ఆయన టీడీపీ పెద్దల మీద పదునైన విమర్శలు చేస్తారు. అయితే ఒక్కోసారి అవే శృతి తప్పి బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు. మహిళా ప్రజా ప్రతినిధులు నాయకుల విషయంలో చేసే విమర్శలు కొంత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా అవే ఇబ్బందికరం అవుతాయని అంటున్నారు. అనిత మేకప్ గురించి వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ మహిళా లోకం మీద దాడిగా టీడీపీ ప్రచారం చేస్తోంది. మహిళల స్వేచ్చ గురించి వైసీపీకి పట్టింపు లేదని కూడా దుయ్యబెడుతోంది. దీంతో వైసీపీ నేతల పరిస్థితి ఇరకాటంలో పడుతోంది.

తలనొప్పులుగానే :

నాయకులు చేసే దుందుడుకు విమర్శలతో పార్టీకి కూడా చిక్కులు తలనొప్పులు వస్తున్నాయని వైసీపీలో చర్చ సాగుతోంది. ప్రభుత్వం పనితీరు మీద ఎన్ని అయినా విమర్శలు చేయవచ్చు అని అదే సమయంలో వ్యక్తిగతం అంటే ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి వైసీపీని ఇపుడు టీడీపీ గట్టిగానే కౌంటర్ చేస్తోంది. హోం మంత్రి మీద గుడివాడ కామెంట్స్ విశాఖ జిల్లాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. మరి గుడివాడ దీని మీద ఏ రకమైన కౌంటర్ ఇస్తారో ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News