సాహసయాత్రలో విషాదం.. మౌంట్ ఎవరెస్ట్ 'డెత్ జోన్'లో 'గ్రీన్ బూట్' ఎవరు?
మౌంట్ ఎవరెస్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన శిఖరాలలో ఒకటిగా భావిస్తారు.;
మౌంట్ ఎవరెస్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన శిఖరాలలో ఒకటిగా భావిస్తారు. 1953 మే 29న ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే అనే ఇద్దరు సాహసికులు ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. వారి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మే 29న 'అంతర్జాతీయ ఎవరెస్ట్ డే' జరుపుకుంటారు. తెల్లని మంచు దుప్పటి కప్పుకుsన్న ఎవరెస్ట్ శిఖరం ఎంత అందంగా ఉంటుందో, అంతే రహస్యాలతో నిండి ఉంది. ఈ రోజు మనం అలాంటి ఒక పర్వతారోహకుడి కథను తెలుసుకుందాం. అతని మృతదేహం దశాబ్దాలుగా తనవారి కోసం ఎవరెస్ట్ పైన మీదనే వెయిట్ చేస్తుంది.
నేపాల్ మీడియా నివేదికల ప్రకారం.. మౌంట్ ఎవరెస్ట్ శిఖరానికి సుమారు 200-300 మీటర్ల దిగువన ఒక మృతదేహం దాదాపు 29 సంవత్సరాలుగా పడి ఉంది. ఇది భారత పర్వతారోహకుడు, ఐటీబీపీ జవాన్ షేవాంగ్ పల్జోర్ మృతదేహం. ఎవరెస్ట్ ఎక్కే పర్వతారోహకులు అతనిని చూసి అలసిపోయి నిద్రపోతున్నాడేమో అనిపిస్తుందట. అది ఒక మృతదేహం అని ఎవరూ గుర్తించలేరట. ఈ మృతదేహాన్ని అతని ఆకుపచ్చ రంగు బూట్ల (Green Boots) ద్వారా గుర్తిస్తారు. అందుకే షేవాంగ్ మృతదేహాన్ని ఇప్పుడు 'గ్రీన్ బూట్స్' అని పిలుస్తున్నారు. కొందరు అతనిని చూసి భయపడితే, మరికొందరు అతని పక్కనే నిలబడి ఫోటోలు తీసుకుంటారు.
'గ్రీన్ బూట్స్' అని పిలిచే ఈ మృతదేహం ఐటీబీపీ జవాన్,భారత పర్వతారోహకుడు షేవాంగ్ పల్జోర్‌దే. అతను తన స్నేహితులతో కలిసి 1996 మే 10న మౌంట్ ఎవరెస్ట్‌ను జయించడానికి వెళ్ళాడు. వారు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారని, తిరిగి వస్తుండగా మంచు తుఫాన్‌లో చిక్కుకుని మరణించారని చెబుతారు. అతని మరణంపై నేటికీ కొన్ని వివాదాలున్నాయి. కొందరు పర్వతారోహకులు షేవాంగ్ మంచు తుఫాన్‌లో బతికి ఉండవచ్చని, కానీ ఎవరూ అతనికి సహాయం చేయలేదని అంటారు. అతను, అతని సహచరులు సహాయం కోసం కేకలు వేశారని, కానీ ఇతర పర్వతారోహకులు విజయం సాధించాలనే తపనతో సహాయం చేయడం అవసరంగా భావించలేదని చెబుతారు. అప్పటి నుంచి నేటి వరకు అతని మృతదేహం అక్కడే పడి ఉంది.
మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు సుమారు 8848 మీటర్లు. ఇంత ఎత్తులో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మెదడు, ఊపిరితిత్తుల నరాలు పగిలిపోయే ప్రమాదం ఉంది. 8000 మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతంలోనే ఎక్కువ మంది పర్వతారోహకులు మరణిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని 'డెత్ జోన్' అని పిలుస్తారు. నివేదికల ప్రకారం.. 2019 వరకు ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నంలో సుమారు 308 మంది పర్వతారోహకులు మరణించారు.
ఇంత ఎత్తు నుంచి శవాలను కిందికి తీసుకురావడం చాలా కష్టమైన పని. అందుకే పర్వతారోహకులు తమ సహచరుల మృతదేహాలను అక్కడే వదిలేస్తారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత -16 నుంచి -40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది డీప్ ఫ్రీజర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మృతదేహాలు కుళ్ళిపోకుండా అలాగే ఉండిపోతాయి.