అన్నా డీఎంకే-డీఎంకే సర్కార్...గవర్నర్ కీలక వ్యాఖ్యలు !
తమిళనాడు రాజకీయంలో బిగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. హాలీవుడ్ సినిమాలో కూడా బహుశా ఇన్ని ట్విస్టులు ఉండవేమో.;
తమిళనాడు రాజకీయంలో బిగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. హాలీవుడ్ సినిమాలో కూడా బహుశా ఇన్ని ట్విస్టులు ఉండవేమో. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీ బలమేంటో తెలిసిపోయింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలి అన్నది గవర్నర్ మీద ఆధారపడి ఉంది. దాంతో అంతా లోక్ భవన్ వైపు చూస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ని లోక్ భవన్ లో టీవీకే చీఫ్ విజయ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరినా ఆయన మెజారిటీ కావాలనే అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ కి అవసరం అయిన 118 మందిని చూపిస్తే కనుక కచ్చితంగా పిలుస్తామని చెబుతున్నారు. దాంతో మెజారిటీ నంబర్స్ వేటలో టీవీకే నాయకులు ఫుల్ బిజీగా ఉన్నారు.
క్యాంపులతో రాజకీయం :
మరో వైపు చూస్తే డీఎంకే అన్నా డీఎంకే క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేశాయి. టీవీకేకి అవసరం అయిన సంఖ్యా బలం లేనందువల్ల తమ పార్టీల నుంచి ఎక్కడ చీలిక తెస్తారో అన్న భయం ఆయా పార్టీల అధినేతలకు ఉంది. దానికి తగినట్లుగానే కొందరు టీవీకే కీలక నేతలు అయితే ఆయా పార్టీలకు టచ్ లోకి వెళ్తున్నారు అని అంటున్నారు. దీంతో ఏ శిబిరంలో చీలిక వస్తుందో అన్న కలవరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ద్రవిడ పార్టీల అధినాయకత్వాలకు రెండు భయాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు ముందు చీలికను నివారించినా తరువాత అసలు తమ వల్ల కాదని భావిస్తున్నాయి. దాంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరం అయిన నంబర్స్ కి దక్కక ముందే తామే చేతులు కలిపి సర్కార్ ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్నదే ద్రవిడ పార్టీల అధినాయకత్వాలలో కొత్త ఆలోచన అని అంటున్నారు. గత ఆరున్నర దశాబ్దాలుగా తమిళనాడులో గట్టి పట్టు సాధించుకున్న ద్రవిడ పార్టీల రాజకీయం టీవీకే ప్రభుత్వం ఏర్పాటుతో భగ్నం అవుతుందన్న భయాందోళనలూ ఆయా పార్టీల పెద్దలలో ఉన్నాయని అంటున్నారు.
గవర్నర్ కామెంట్స్ :
ఇదిలా ఉంటే తమిళనాడు గవర్నర్ గా ఉన్న రాజేంద్ర అర్లేకర్ తాజాగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రస్తుతం ఊహాగానంగా ప్రచారంగా ఉన్న డీఎంకే అన్నా డీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే ఏమి చేస్తారు అని గవర్నర్ ని ఒక టీవీ చానల్ ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నకు ఆయన కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ కూటమికి తగినంత సంఖ్యా బలం ఉందో లేదో చూసి ఆ మీదట నిర్ణయం తీసుకుంటాను అని గవర్నర్ చెప్పడం విశేషం. ఒక వేళ వారు తమ మెజారిటీని ఈ రోజు నిరూపించుకుంటే రేపే ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని గవర్నర్ చెప్పడం ఇపుడు తమిళనాడులో కొత్త చర్చకు దారి తీస్తోంది.
టీవీకే మూకుమ్మడిగా :
ఇలా ద్రవిడ పార్టీల కూటమి కనుక తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక టీవీకేకు చెందిన ఎమ్మెల్యేలు 107 మంది మూకుమ్మడిగా రాజీనామా చేయాలని కూడా ఆ పార్టీ అధినాయకత్వం సూచించిందని దీని మీద ఇపుడు ఒక హాట్ డిస్కషన్ జరుగుతోందని అంటున్నారు. గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలవకపోవడం మరో వైపు చూస్తే ద్రవిడ పార్టీల శిబిరాలలో జోరుగా మంతనాలు జరగడంతో టీవీకే నాయకులు ఏదో జరగబోతోంది అని అనుమానిస్తున్నారుట. దాంతో వారు కీలక నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అన్నీ లోక్ భవన్ చుట్టూ రిసార్ట్స్ లలో నిర్వహిస్తున్న క్యాంపుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.