రూ.లక్షకు చేరువైనా.. దిగుమతుల జోరు తగ్గట్లేదు
చూస్తుండగానే పదిగ్రాముల బంగారం రూ.లక్షకు దగ్గరైంది. గడిచిన కొన్నేళ్లలో ధరలో భారీ పెరుగుదల ఈ ఏడాదే చేసుకుందని చెప్పాలి.;
చూస్తుండగానే పదిగ్రాముల బంగారం రూ.లక్షకు దగ్గరైంది. గడిచిన కొన్నేళ్లలో ధరలో భారీ పెరుగుదల ఈ ఏడాదే చేసుకుందని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. గడిచిన పదేళ్లలో ఏడాది వ్యవధిలో ఇంత భారీగా ధర పెరగటం ఇదేనని చెబుతున్నారు. మరో రెండు మూడేళ్ల వరకు పది గ్రాముల బంగారం రూ.లక్షకు చేరుకునే అంచనాలు ట్రంప్ పుణ్యమా అని చోటు చేసుకున్న అంతర్జాతీయ పరిణామాలు మార్చేశాయని చెప్పాలి. రూ.లక్షకు చేరుకోవటం ఇవాళ.. రేపా అన్నట్లుగా ఉంది.
బంగారం ధర ఇంత భారీగా పెరిగిన వేళ.. రిటైల్ అమ్మకాల్లో తేడా వచ్చిందని.. కొనుగోళ్లు తగ్గాయన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇదంతా ఒక కోణమేనని చెబుతున్నారు. బంగారం ధర భారీగా పెరిగిన తర్వాత కూడా దేశంలో దిగుమతులు మాత్రం అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గట్లేదని చెబుతున్నారు. తాజాగా మార్చి నెలకు సంబంధించిన గణాంకాల్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే.. మార్చిలో దిగుమతుల విలువ 191.13 శాతం పెరిగి.. 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లుగా వెల్లడించారు. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.33వేల కోట్లుగా చెబుతున్నారు. దిగుమతులు భారీగా పెరగటంతో అదే స్థాయిలో ద్రవ్యలోటు పెరుగుతుందన్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో 2024-25లో సుమారు 58 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి అయ్యింది. అంతకు ముందు ఏడాది (2023-24)లో ఇది 45.54 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే.. పెరుగుదల శాతం 27.27గా చెప్పాలి.
ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి బంగారం పది గ్రాములు రూ.98వేలకు పైనే పలుకుతోంది. భారత్ దిగుమతిచేసుకుంటున్న బంగారంలో 40 శాతం వాటాతో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. యూఏఈ 16 శాతం.. సౌతాఫ్రికా 10 శాతం చొప్పున ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 757.15 టన్నులు (టన్ను అంటే 1000 కేజీలు)గా ఉంటే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 757.15 టన్నులకు తగ్గింది. ప్రపంచంలో బంగారం దిగుమతి విషయంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ ఉండి. బంగారానికి సంబంధించి జ్యూయలరీ పరిశ్రమ నుంచి డిమాండ్ భారీగా ఉన్నట్లు చెబుతున్నారు.