తెలుసుకోవాల్సిన విషయం... గోల్డ్ లోన్ పై బ్యాంకుల కొత్త ఆంక్షలు!
అవును.. గత కొంతకాలంగా బంగారం ధర ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే.;
లోన్స్ తీసుకునే విషయంలో సిబిల్ స్కోర్ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ప్రతీ వ్యక్తి ఆర్ధిక క్రమశిక్షణకు.. క్రెడిట్ వ్యాల్యూకు సిబిల్ స్కోరు చాలా ముఖ్యమైంది. ఈ నేపథ్యంలో బంగారంపై రుణాలు తీసుకున్నవారికి ఓ కీలకమైన సమాచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా గోల్డ్ లోన్ తీసుకున్నవారు నెలనెలా వడ్డీ చెల్లించాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి!
అవును.. గత కొంతకాలంగా బంగారం ధర ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... గోల్డ్ లోన్స్, తిరిగి వసూలు విషయంలో బ్యాంకులకు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ గోల్డ్ లోన్స్ తీసుకున్న వారు ఏడాది గడువులోగా తిరిగి చెల్లించకపోవడంతో సుమారు 30 శాతానికిపైగా ఎగవేతదారుల జాబితా(ఎన్.పీ.ఏ)లో చేరుతున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగా కాకుండా బంగారంపై రుణం తీసుకున్న తేదీ నుంచి నెలనెలా వడ్డీని పూర్తిగా వసూలు చేయాలని, తద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి. ఇలా నెలనెలా వడ్డీ కట్టనిపక్షంలో.. అది ఖాతాదారు సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపిస్తుందని.. ఫలితంగా క్రెడిట్ వ్యాల్యు పడిపోతుందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి.
గోల్డ్ లోన్ పై ఆర్బీఐ మార్గదర్శకాలివే!:
వాస్తవానికి గోల్డ్ విలువ ఆధారంగా ఎంత లోన్ ఇవ్వాలనే విషయంపై ఆర్బీఐ మార్గదర్శకాలున్నాయి. ఇందులో భాగంగా... గోల్డ్ లోన్ రూ.2.50 లక్షలలోపు తీసుకుంటే బంగారం విలువలో 85 శాతం, రూ.5 లక్షలలోపు రుణం అయితే 80 శాతం.. అంతకుమించితే 75 శాతమే ఇవ్వాలని నిబంధనలున్నాయి. అయితే.. ప్రైవేటు ఆర్థిక సంస్థలు అంతకుమించి ఇస్తున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో... గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే గోల్డ్ లోన్స్ దేశంలో 26 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి! ఈ క్రమంలో.. రుణం తీసుకున్న ఏడాదిలోగా బాకీ పూర్తిగా తిరిగి చెల్లించి మళ్లీ కొత్త రుణం తీసుకోవాలనే నిబంధన ఇప్పటికే ఉంది. అయితే.. కొన్ని బ్యాంకులు వడ్డీ మాత్రం నెలనెలా చెల్లించాలని చెబుతున్నాయి!
కాగా... భారతదేశంలోని ఇళ్లల్లో 25,000 టన్నులకు పైగా బంగారం ఉందని.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు నిల్వలలో ఒకటిగా నిలిచిందని గణాంకాలు చెబుతున్నాయి! పైగా భారతీయ గృహాల్లో బంగారం ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, భావోద్వేగ, ఆర్థిక విలువను కలిగి ఉన్న నమ్మకమన ఆస్తి కూడా!
దీంతో... ఇటీవలి కాలంలో ప్రణాళికాబద్ధమైన, ప్రణాళిక లేని ఖర్చులను నిర్వహించడానికి ఎక్కువ మంది బంగారు రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అందులో కొంతమందే సమయానికి వాటిని తిరిగి చెల్లిస్తున్నారని అంటున్నారు! ఈ సమస్యలను అధిగమించడానికి గతంలో మాదిరిగా కాకుండా బంగారంపై రుణం తీసుకున్న తేదీ నుంచి నెలనెలా వడ్డీని పూర్తిగా వసూలు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించాయి.