జెన్ జెడ్ పోస్టాఫీస్.. విద్యార్థుల కోసం వినూత్న ఆలోచన
విద్యార్థుల కోసం పోస్టల్ శాఖ వినూత్న ఆలోచన చేసింది. యూనివర్సిటీల ప్రాంగణంలో జెన్ జెడ్ పోస్టాఫీసులను ప్రారంభించాలని నిర్ణయించింది.;
విద్యార్థుల కోసం పోస్టల్ శాఖ వినూత్న ఆలోచన చేసింది. యూనివర్సిటీల ప్రాంగణంలో జెన్ జెడ్ పోస్టాఫీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ఆధునిక పోస్టాఫీసుల్లో సిబ్బంది ఎవరూ ఉండరు. విద్యార్థులే ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తమ సేవలను స్వయంగా పొందేలా తీర్చిదిద్దారు. ఈ కొత్త ప్రయోగం ఢిల్లీలో సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ప్రవేశపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జెన్ జెడ్ పోస్టాఫీసును మంగళవారం ప్రారంభించారు. జెన్-జెడ్ థీమ్ తో పనిచేయనున్న ఈ పోస్టాఫీసులను గత నెలలోనే ఢిల్లీలో ప్రారంభించారు. నవంబరు 19న ఢిల్లీ ఐఐటీలో 20న ఢిల్లీ యూనివర్సిటీలో జెన్ జెడ్ పోస్టాఫీసులు ప్రారంభమై విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో ఈ తరహా పోస్టాఫీసులను దేశవ్యాప్తంగా విస్తరించాలని తపాలా శాఖ నిర్ణయించింది.
ఆంధ్రా యూనివర్సిటీలో మంగళవారం ప్రారంభమైన జెన్-జెడ్ పోస్టాఫీసును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. లోపలికి అడుగు పెట్టగానే ఓ కేఫ్ కు వచ్చామా? అన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా నడిచే ఈ పోస్టాఫీసును పూర్తిగా విద్యార్థులే నిర్వహించుకోవాల్సి వుంటుంది. పోస్టాఫీస్ లోపలికి ప్రవేశించగానే క్యూఆర్ కోడ్‌ల చిత్రాలు, వాటిని స్కాన్ చేస్తే ఏ రకమైన సేవలు అందుతాయో తెలిపే వివరాలతో బోర్డులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరికి వారే మొబైల్ ఫోన్ ద్వారా పోస్టల్ సేవలు నిర్వహించుకోవాలి. ఒకవేళ ఏదైనా అవసరమైన సాయం అందించేందుకు తపాలాశాఖ నుంచి ఒక ఉద్యోగి మాత్రమే అందుబాటులో ఉంటారు.
పోస్టల్ విభాగం కేవలం లేఖలను బట్వాడా చేయడానికే కాకుండా నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా పనిచేస్తుందని, ఆధునిక సాంకేతిక సేవలు అందించే కేంద్రంగా మార్పు చెందిందని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే జెన్-జెడ్ పోస్టాఫీసులకు శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 46 విద్యాసంస్థల్లో జెన్-జెడ్ పోస్టాఫీసుల ప్రారంభానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ జెన్ జెడ్ పోస్టాఫీసులను సోషల్ లెర్నింగ్ స్పేస్ గా తీర్చిదిద్దడం ఆకట్టుకునే అంశం.
జెన్-జెడ్ పోస్టాఫీసులో విద్యార్థులు ఉచితంగా వైఫై సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. పుస్తకాలు చదువుకునే లైబ్రెరీ కూడా ఉంటుంది. అంతేకాకుండా సౌకర్యవంతంగా కూర్చొని ఆర్ట్ ప్రదర్శనలను వీక్షించవచ్చు. క్యాంపస్ లో విద్యార్థులు, పరిశోధకులు, స్థానిక నివాసితులు స్వేచ్ఛగా సమయం గడపడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇంటరాక్షన్ జోన్ గా వినియోగించుకోవచ్చు. ఈ పోస్టాఫీసుల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత పార్సిల్ బుకింగ్, విద్యార్థులకు అవసరమైన స్పీడ్ పోస్ట్ డిస్కౌంట్ లతో సహా స్మార్ట్ సర్వీసులు ఉన్నాయి.
జెన్-జెడ్ పోస్టాఫీసులో ఆర్ట్ కార్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులు గీసిన చిత్రాలు, స్కెచ్‌లు, ఫొటోగ్రాఫ్‌లను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా యువ కళాకారులను ప్రోత్సహించే వేదికగా ఉపయోగపడుతుంది. క్యాంపస్‌లో సృజనాత్మక వాతావరణాన్ని పెంచుతుందని అంటున్నారు. విద్యాలయాలను శక్తివంతమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చొరవను ఇది ప్రతిబింబిస్తుందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది.