‘జెన్ జీ’ వల్ల రూ.76లక్షల కోట్లు నష్టం.... లిక్కర్ పరిశ్రమకు తూట్లు పొడుతున్న వైనం..
తమ మార్కెట్ భారీగా పడిపోతుండడంతో లిక్కర్ కంపెనీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి.;
ఇప్పుడు మొదలైన తరం జన్ జీల గురించి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే కలవరపడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి ఆలోచన శైలి ఎటు వెళ్తుందో.. వారు ఎలా మారుతున్నారో చెప్పడం కష్టంగా మారుతోంది. మానసిక శాస్త్రవేత్తలు సైతం కన్ఫ్యూజన్ అవుతున్నారంటే ఆతిశయోక్తి కాదు.. ఒక్కో ప్రదేశం.. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. కొన్ని కంట్రీల్లో ప్రభుత్వాలను పడగొడుతున్నారు.. మన దేశంలో కంట్రీల్లో భక్తిలో తేలుతున్నారు.. భజన్ క్లబ్స్ లో చేరి చిందులు వేస్తున్నారు.. డ్రగ్స్, మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా దశాబ్దాల తరబడి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మద్యం పరిశ్రమకు ఇప్పుడు కొత్త తరం రూపంలో పెద్ద గండం పొంచి ఉంది. ప్రస్తుత యువత, ముఖ్యంగా 'జన్ జీ' (Gen Z) తరం తీసుకుంటున్న నిర్ణయాలు లిక్కర్ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం.., ఈ తరం తీసుకుంటున్న ఆరోగ్యకరమైన నిర్ణయాల వల్ల మద్యం పరిశ్రమకు ఏకంగా రూ. 76 లక్షల కోట్లు (సుమారు 839 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని తేలింది. ఒకప్పుడు సామాజిక హోదాగా, ఎంజాయ్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా భావించిన మద్యం, నేడు యువత దృష్టిలో కేవలం ఒక అనారోగ్యకరమైన అలవాటుగా మారిపోతుండటం విశేషం.
మారుతున్న ప్రాధాన్యతలు
గత తరాలైన 'బేబీ బూమర్స్' లేదంటే 'మిలీనియల్స్'తో పోలిస్తే, జన్ జీ తరం తమ ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపుతోంది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతకు వీరు పెద్దపీట వేస్తున్నారు. మత్తు వద్దు.. ఆరోగ్యం ముద్దు అంటూ చెప్పడమే కాదు పాటిస్తున్నారు కూడా.. మద్యం వల్ల కలిగే తక్షణ హ్యాంగోవర్ మాత్రమే కాకుండా, దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత వ్యాధులు, మెదడుపై పడే ప్రభావాన్ని ఈ తరం యువత క్షుణ్ణంగా అర్థం చేసుకుంటోంది. సోషల్ మీడియా ప్రభావం కూడా లేకపోలేదు.. ఒకప్పుడు పబ్‌లలో మద్యం తాగడం ఫ్యాషన్‌గా ఉండేది. కానీ నేడు జిమ్ ఫొటోలు, పోషకాహార డైట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది యువతను మత్తుకు దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చుతోంది.
ఆర్థిక క్రమశిక్షణ..
మద్యం తాగడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని ఈ తరం భావిస్తోంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని, ఆ సొమ్మును అనుభవాల కోసం (Travel) లేదంటే పెట్టుబడుల (Investments) కోసం కేటాయించే ధోరణి పెరుగుతోంది. అలాగే, మద్యం తాగడం మరుసటి రోజు పనిలో ఉత్పాదకత (Productivity) తగ్గడం కూడా వీరికి ఇష్టం లేదు. కెరీర్ పై అత్యంత క్లారిటీతో ఉన్న యువత, మత్తులో మునిగి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.
లిక్కర్ పరిశ్రమ సందిగ్ధత
తమ మార్కెట్ భారీగా పడిపోతుండడంతో లిక్కర్ కంపెనీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. యువతను ఆకర్షించడానికి అవి ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి అందులో భాగంగా.. నాన్-ఆల్కహాలిక్ పానీయాలు, మద్యం శాతం లేని బీర్లు, వైన్ల తయారీపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. లో-క్యాలరీ డ్రింక్స్ డయాబెటిస్ లేదంటే బరువు పెరగకుండా ఉండేలా తక్కువ చక్కెర గల పానీయాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. ప్రీమియం బ్రాండ్లు.. తక్కువ తాగినా, నాణ్యమైనదే తాగాలి అనే సూత్రాన్ని నమ్ముతున్న వారి కోసం ఖరీదైన 'ప్రీమియం' బ్రాండ్లను ప్రచారం చేస్తున్నాయి.
సామాజిక మార్పునకు సంకేతం
ఇది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన ఆర్థిక నష్టం మాత్రమే కాదు, ఒక సామాజిక విప్లవానికి సంకేతం. యువత మత్తుకు దూరంగా ఉంటే అది ఆ దేశ అభివృద్ధికి, కుటుంబాల సుఖశాంతులకు మేలు చేస్తుంది. మద్యం రహిత జీవనశైలిని (Sober Curiosity) ఒక ట్రెండ్‌గా మార్చిన జన్ జీ తరం, రాబోయే రోజుల్లో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రూ. 76 లక్షల కోట్ల నష్టం అనేది లిక్కర్ పరిశ్రమకు భయంకరమైన అంకె కావచ్చు, కానీ సమాజానికి ఇది ఒక సానుకూల పరిణామం. వ్యాపార లాభాల కంటే పౌరుల ఆరోగ్యమే మిన్న. మద్యం మత్తులో ఊగడం కంటే, స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించుకోవాలనే జన్ జీ సంకల్పం అభినందనీయం. కంపెనీలు మారాలి లేదా కాలగర్భంలో కలవాలి; కానీ యువత మాత్రం తమ ఆరోగ్య సూత్రాన్ని విస్మరించకూడదు.