భావి ముఖ్యమంత్రులు : అడుగు దూరంలోనే ఆగిపోతున్నారు.

భావి ముఖ్యమంత్రులు అని ఎవరిని అయినా అనుకుంటే మాత్రం వారి రాజకీయ జాతకం పూర్తిగా తిరగబడుతోంది.;

Update: 2026-05-12 03:45 GMT

భావి ముఖ్యమంత్రులు అని ఎవరిని అయినా అనుకుంటే మాత్రం వారి రాజకీయ జాతకం పూర్తిగా తిరగబడుతోంది. వారు అధికారానికి పక్కనే ఉంటున్నారు. ఇంకేముందు ఒక్క అడుగే ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించవచ్చు అనుకుంటున్నారు కానీ అక్కడే అంతా తేడా కొడుతోంది. చేతికి నోటికీ మధ్య అతి పెద్ద వ్యత్యాసం ఉంటుందని ఒక ముతక సామెత. అదే నిజం అన్నట్టుగా రాజకీయాల్లో అనేక పరిణామాలు కనిపిస్తాయి. తండ్రికి వారసుడు ఉంటాడు. ఇక ఏముంది ఆయనే రేపటి ప్రభుత్వాధిపతి అనుకుంటారు అంతా. కానీ తీరా చూస్తే జనాలు మాత్రం రివర్స్ లో తిప్పికొడుతున్నారు.

ప్రజా తీర్పు వెనక :

సరిగ్గా రెండున్నరేళ్లు వెనక్కి వెళ్తే 2023లో తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎసారి హ్యాట్రిక్ తప్పదు అని బీఆర్ఎస్ భావించింది. గెలిస్తే కనుక తప్పకుండా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని అంతా అనుకున్న నేపధ్యం ఉంది. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని పక్కన పెట్టేశారు జనాలు. కాంగ్రెస్ ని గెలిపించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు. ఇక 2028 దాకా కేటీఆర్ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దాంతో ఫ్యూచర్ సీఎం అన్న ప్రచారం ఆయనకు కలిసి రాలేదా అన్న చర్చ సాగింది అప్పట్లో

ఉదయనిధి సంగతి కూడా :

కట్ చేస్తే తమిళనాడులో కూడా అదే సీన్ రిపీట్ అయింది. స్టాలిన్ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని పార్టీని ఒంటి చేత్తో ఉదయ నిధి నడిపిస్తున్నారు అని అంతా అనుకున్నారు ఆయనే 2026 లో ముఖ్యమంత్రి అన్నట్లుగా భారీ ఎత్తున ప్రచారం సాగింది. కానీ జనాలు వేరేగా తలచారు, 2024 లో ఫిబ్రవరి పార్టీ పెట్టిన విజయ్ ని తీసుకుని వచ్చి సీఎం గా చేశారు ఇపుడు ఉదయనిధి ఆశలు 2031 దాకా వాయిదా వేసుకోవాల్సిన నేపధ్యం ఉంది.

బీహార్ లోనూ అదే కధ :

బీహార్ లో చూసినా అదే కధ సాగింది. ఆర్జేడీ యువ నేత ఉప ముఖ్యమంత్రిగా చేసిన తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు ముఖ్యమంత్రి అని అంతా అనుకున్నారు. ఎన్నికల ఫలితాలు రావడమే ఆలస్యం అని కూడా ఆర్జేడీ నేతలు భావించారు. ఆర్జేడీ అధినేత, తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ అయితే ఈసారి దీపావళి వేరేగా ఉంటుందని తమ ఇంట అధికార దీపావళి అని చెప్పారు. కానీ ఆ ఎన్నికల్లో దారుణంగా ఆర్జేడీ ఓటమి పాలు అయింది. అంతే కాదు పశ్చిమ బెంగాల్ లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది అక్కడ మమతా బెనర్జీ మేనల్లుడు, రాజకీయ వారసుడిగా భావి ముఖ్యమంత్రిగా పార్టీ జనాల చేత అనిపించుకున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా 2031 దాకా తన ఆశలను దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా ఎందుకు అంటే అధినేతలకు వారసత్వం మీద మోజు ఉండవచ్చు. తమ వారు కాబట్టి తమ కుర్చీ ఇవ్వాలని అనుకోవచ్చు. అధినేత మీద ప్రేమతో పార్టీ కూడా తలూపి అంగీకరించవచ్చు. కానీ జనాలలో మాత్రం ఇదే వ్యతిరేకతను రాజేస్తోంది. తాము ఓటు వేసి కదా అందలాలు అందిస్తామని సగటు జనాలు భావిస్తారు. తమ ప్రమేయం లేకుండా వారసులను తెచ్చి పెడితే ఒప్పుకునేది లేదని చెప్పడానికే ఈ తరహా ఫలితాలు ఇస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News