జైలులో తీవ్ర అస్వస్థత.. విజయవాడ ఆస్పత్రికి మరోమారు వంశీ
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.;
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. పలు కేసుల్లో అరెస్టు అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి ఆకస్మికంగా వంశీ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం వంశీని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారని చెబుతున్నారు. జైలులో డీ హైడ్రేషనుకు లోనైన వంశీ వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైనట్లు జైలు సిబ్బంది తెలిపారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో పోలీసుల సహకారంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ తో రాజీ కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే వంశీ.. సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో అరెస్టు అయ్యారు. ఫిబ్రవరి 13న హైదరాబాదులో వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. దాదాపు నాలుగు నెలలుగా వంశీ జిల్లా జైలులోనే ఉన్నారు. ఈ సమయంలో వంశీపై పాత కేసులన్నీ తవ్వితీయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో చిక్కులు ఎదుర్కొంటున్నారు.
వంశీపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. తొలుత కిడ్నాప్ కేసులో జైలుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేపై ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేసింది. ఇందులో భూ కబ్జా కేసులతోపాటు అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. అయితే 8 కేసుల్లో బెయిల్ కోసం వంశీ ప్రయత్నిస్తుంటే కొత్తగా మరో కేసు తెరపైకి రావడంతో ఆయన జైలుకే పరిమితం కావాల్సివచ్చిందని అంటున్నారు. జైలుకు వచ్చినప్పుడు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉండటంతో ఆయనకు బెయిలు మంజూరు కావడం లేదని అంటున్నారు. దీంతో నాలుగు నెలలుగా జైలులో ఉన్న వంశీ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఆయన ముఖం పూర్తిగా వాడిపోయినట్లు కనిపిస్తున్నారు. అంతేకాకుండా నీరసించిపోయి, ముఖమంతా పాలిపోయి కనిపిస్తున్నారు.