సైబర్ బాధితులకు అండగా సీ-మిత్ర.. దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లో!
కొన్ని దశాబ్దాల క్రితం ఊళ్ల మీద పడి దోచుకునే బందిపోట్ల గురించి విన్నాం. ఆ తర్వాత దొంగల గురించి విన్నాం.;
కొన్ని దశాబ్దాల క్రితం ఊళ్ల మీద పడి దోచుకునే బందిపోట్ల గురించి విన్నాం. ఆ తర్వాత దొంగల గురించి విన్నాం. గడిచిన కొంతకాలంగా సైబర్ దొంగల గురించి వింటున్నాం. ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్లాన్ చేస్తూ.. ప్రజల బలహీనల్ని టార్గెట్ చేస్తూ దోచుకుంటున్న వీరి కారణంగా ఎంతో మంది ఆర్థికంగా దారుణంగా నష్టపోతున్న పరిస్థితి. సైబర్ బందిపోట్ల బారిన పడి నష్టపోతున్న చాలామంది తమకు జరిగిన నష్టానికి పోలీసులకు సైతం చెప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ పోలీస్ స్టేషన్ కు వెళ్లినా.. అక్కడి పరిస్థితులకు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వీలుగా సరికొత్త పద్దతిని తెర మీదకు తీసుకొచ్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి హైదరాబాద్ మహానగరంలో అమలు చేస్తున్న ఈ విధానంతో సైబర్ బాధితులు ఇంటి నుంచి బయటకు రాకుండానే పోలీసులకు ఫిర్యాదు చేయటం.. వాట్సాప్ లోనే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే చిక్కులకు చెక్ పడనుంది.
సీ-మిత్ర పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ విధానంలోకి వెళితే.. హైదరాబాద్ మహానగరంలోని బషీర్ బాగ్ లో ఉన్న సీసీఎస్ లోని సైబర్ క్రైమ్ విభాగంలో వర్చువల్ హెల్ప్ డెస్కును నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ ప్రారంభించారు. ఇదెలా పని చేస్తుందంటే..హైదరాబాద్ మహానగర బాధితులు నేషనల్ హెల్ప్ డెస్కు అయిన 1930కు ఫోన్ చేసి.. తాము మోసపోయిన విషయాన్ని సమాచారం అందిస్తే చాలు.. ఆ వివరాలు వెంటనే సీసీఎస్ కు అందుతాయి. అక్కడి నుంచి పోలీసులు బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు.
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ కు పంపుతారు. ఆ వివరాల్ని బాధితులకు అందిస్తారు. దీంతో.. తాము మోసపోయిన వైనంపై పోలీసు కేసు కావటంతో పాటు.. సంబంధిత పోలీస్ స్టేషన్ వివరాలు కూడా వారు తెలుసుకునే వీలు ఉంటుంది. సి-మిత్ర విధానంలో రూ.3 లక్షల లోపు సైబర్ మోసాలకు సంబంధించిన వివరాల్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతారు. అంతకు మించిన కేసులను మాత్రం సైబర్ క్రైం నేరుగా విచారించనుంది. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.
అంతేకాదు.. డిజిటల్ అరెస్టుకు సంబంధించి సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. అయితే.. అలాంటివి ఉండవని ఎంత చెప్పినా.. ప్రజలు మోసపోతున్న పరిస్థితి. సీ-మిత్ర విధానంలో పోలీసులు ఫోన్ చేసే నేపథ్యంలో సైబర మోసగాళ్లు కొత్త మోసాలకు తావివ్వకుండా ఉండేందుకు వీలుగా ఒక విధానాన్ని రూపొందించారు. బాధితులకు 040-41893111 నెంబరు నుంచి మాత్రమే కాల్ వస్తుందని.. అది అధికారిక ఫోన్ కాల్ అన్నది మర్చిపోవద్దని ప్రజల్ని కోరుతున్నారు. అంతేకాదు 87126 సిరీస్ తో ప్రారంభమయ్యే పోలీసుల అధికారిక వాట్సాప్ నుంచి ఎఫ్ఐఆర్ పంపుతారని స్పష్టం చేస్తున్నారు. సో..ఈ సమాచారాన్ని ఎవరికి వారు తమ వద్ద ఉంచుకోవటంతో పాటు తెలిసిన వారికి.. సన్నిహితులకు.. మిత్రులకు షేర్ చేయటం ద్వారా వారిని సైబర్ మోసగాళ్ల మోసాల నుంచి తప్పించే వీలుంది.