పిల్లల అందం బాధ్యత తండ్రిదే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?
అయితే ఈ పరిశోధన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.;
మానవుని జననం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. మనిషి పుట్టుక మొదలు.. చచ్చే వరకూ కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ముఖ్యంగా ఒక ఆరోగ్యకరమైన శుక్రకణం.. ఒక అండంతో కలిసి ఫలదీకరణం పొందితే.. పిండంగా మారి..అది తొమ్మిది నెలల్లో పూర్తిస్థాయిలో ఒక బిడ్డగా రూపాంతరం చెందుతుంది. ఇదే క్రమంలో కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి నుంచి ఒక సెట్ జన్యువులను, తల్లి నుంచి ఒక సెట్ జన్యువులను పొందుతుంది.. అందుకే కొంతమంది కుటుంబ సభ్యులు చాలా వరకు ఒకే విధంగా కనిపిస్తారు. కొంతమందికి అమ్మమ్మగారింటి పోలికలు ఉంటే. మరి కొంతమందికి నాన్నగారి ఇంటి పోలికలు ఎక్కువగా వస్తాయి. తల్లి నుంచి, తండ్రి నుంచి పోలికలను పొంది బేబీ జన్మిస్తారు.
అలాంటి ఈ సమయంలో బిడ్డ పుట్టిన వెంటనే ఎవరి పోలికలు వచ్చాయి అనేది చాలామంది చెక్ చేసుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా బిడ్డ అందంగా కనిపిస్తే చాలు తల్లి పోలికలే వచ్చాయని మురిసిపోతూ ఉంటారు. కానీ నిజానికి పిల్లలు శారీరక సౌందర్యాన్ని, ఆకర్షణీయమైన లక్షణాలను తండ్రుల నుంచే పొందుతారని పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో ముఖ్యంగా ముఖ సౌష్ఠవం, ఎముకల నిర్మాణం, బలమైన దవడ గీతలు, కళ్ళ మధ్య దూరం వంటి లక్షణాలు పూర్తిగా తండ్రి జన్యువుల నుంచే సంక్రమిస్తాయట. ముఖ్యంగా పిల్లలు అందంగా కనిపిస్తున్నారంటే అందులో తండ్రి పాత్రే కీలకమని పరిశోధనలో తెలియజేశారు.
అయితే ఈ పరిశోధన గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలామంది తల్లి నుంచే అందమైన పోలికలు వస్తాయని అనుకునేవారు. కానీ ఇవి తండ్రి నుంచి వస్తాయని పరిశోధకులు తేల్చేయడంతో తల్లులు కూడా ఆశ్చర్యపోతున్నారు.ఇందులో మరో విషయం చెప్పాలంటే తల్లి నుంచి కేవలం ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే వస్తుందని, శిశువు ఆడ, మగ అనేది నిర్ధారణ అయ్యేది కూడా తండ్రి నుంచే సంక్రమిస్తుందనేది చాలామంది అర్థం చేసుకోరు. ప్రస్తుతం ఎంత టెక్నాలజీ వచ్చినా ఇప్పటికీ ఆడపిల్లలు జన్మించే ఇండ్లలో ఆడవాళ్ళనే నిందిస్తూ.. నీ వల్లే మా ఇంట్లో ఆడసంతానం వచ్చిందని మహిళలను వేధించే సందర్భాలు అనేకం ఉంటాయి.
సైన్సు ప్రకారం చూస్తే.. మాత్రం తల్లి గర్భంలో పెరుగుతున్న బేబీ ఆడ,మగా అనేది మగవాళ్ళ నుండి వచ్చే క్రోమోజోమ్ పైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. ఇక తాజాగా పరిశోధకులు చేసిన సర్వే ప్రకారం చూస్తే.. కేవలం లింగ నిర్ధారణ కాకుండా అందం ఇతర శరీర సౌష్టవం తండ్రి నుంచే ఎక్కువగా సంక్రమిస్తుందని తెలిపారు. దీన్ని అర్థం చేసుకొని అయినా ఆడపిల్లలను నిందించడం మానేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.