హైద‌రాబాద్‌ ఔట‌ర్‌లో ఫామ్‌హౌస్‌ల వెన‌క టాప్ సీక్రెట్

హైద‌రాబాద్, ముంబై, దిల్లీ, బెంగ‌ళూరు ఔట‌ర్ ల‌లో భారీ పెట్టుబ‌డుల‌తో ఫామ్ హౌస్ ల‌లో కూర‌గాయలు పండించేవారి క‌థేమిటో తెలిస్తే షాక్ తింటారు!;

Update: 2025-05-06 04:08 GMT

ధ‌నవంతులు అకస్మాత్తుగా న‌గ‌ర ఔట‌ర్‌లో ఫామ్‌హౌస్‌లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? వారంతా వ్య‌వ‌సాయం, ఫామ్‌హౌస్ ల కోస‌మే ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సేంద్రీయ కూరగాయలు పండించేందుకు లేదా ప‌చ్చ‌గ‌డ్డి పెంప‌కం కోసం మాత్రమే కాదు.. కోట్లాది రూపాయ‌ల‌ పన్నుల గోల్‌మాల్‌కి ఉప‌క‌రిస్తుంద‌నేది ఎంద‌రికి తెలుసు? హైద‌రాబాద్, ముంబై, దిల్లీ, బెంగ‌ళూరు ఔట‌ర్ ల‌లో భారీ పెట్టుబ‌డుల‌తో ఫామ్ హౌస్ ల‌లో కూర‌గాయలు పండించేవారి క‌థేమిటో తెలిస్తే షాక్ తింటారు!

ప్ర‌ముఖ ఇన్వెస్టిమెంట్ బ్యాంక‌ర్ విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నం సారాంశం ఇలా ఉంది. భారతదేశంలో అకస్మాత్తుగా ఫామ్‌హౌస్ బూమ్ ప్రారంభమవడానికి అస‌లు కార‌ణం వేరే ఉంది. హైద‌రాబాద్ ఔట‌ర్ కోకాపేట‌, శంషాబాద్, షాద్ న‌గ‌ర్‌, తుర్క‌ప‌ల్లిలో ఫామ్ హౌస్ లు దేని కోసం కొనుగోలు చేస్తున్నారు? ముంబై - దిల్లీ- గురేగావ్- బెంగ‌ళూరు, పూణే, కోల్ క‌త వంటి న‌గ‌రాల ఔట‌ర్ల‌లో పెట్టుబడి పెట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నారు?

వీట‌న్నిటికీ ఏకైక‌ స‌మాధానం - వ్యవసాయ ఆదాయంపై పన్ను లేక‌పోవ‌డ‌మే. భారతదేశంలో, వ్యవసాయం నుండి వచ్చే ఏ ఆదాయం అయినా పూర్తిగా పన్ను రహితం. అంటే ఎవరైనా తమ వ్యవసాయ భూమి నుండి కూరగాయలు, పండ్లు లేదా పాలను పాడి ఉత్ప‌త్తుల‌ను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించామ‌ని చెబితే, వారు దానిపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ వస్తువులపై చాలా తక్కువ లేదా జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) కూడా ఉంది. కాబట్టి లెక్కల్లో చూపని నగదు ఉన్నవారు దానిని వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం అని చెప్పి నిశ్శబ్దంగా బ్యాంకులో జమ చేయవచ్చు. ఈ విధంగా వారు ఆదాయపు పన్ను, జీఎస్టీ రెండింటిలోనూ ఆదా చేయవచ్చు. వ్య‌వ‌సాయంపై జీఎస్టీ లేదు కాబ‌ట్టి వేరే ఆదాయాల‌ను వ్య‌వ‌సాయంలో రాబ‌డిగా చూపిస్తారు. బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేస్తూనే ఉన్నా.. దానిపై జీఎస్టీ ఆదా అవుతుంది. ఎందుకంటే చాలా వ్యవసాయ ఉత్పత్తులకు సున్నా పన్ను లేదా 5శాతం కనీస రేటు ఉంటుంది. కాబట్టి ఆదాయపు పన్ను, జీఎస్టీ పొదుపు రెండూ దాదాపు 40శాతం పన్ను ఆదాతో పన్ను రహితంగా మార‌తాయి.

ధనవంతులు వ్యవసాయం ఆదాయంగా పేరుతో పెద్ద నగదు డిపాజిట్లను చూపించడానికి ఫామ్‌హౌస్‌- వ్య‌వ‌సాయాన్ని ఉపయోగిస్తారు. రెండు లక్షల కంటే తక్కువ నగదు డిపాజిట్లకు పాన్ నంబర్ అవసరం లేదు. చాలా మంది స్థానిక కొనుగోలుదారులు పండ్లు, కూరగాయలకు నగదు చెల్లించారని చెబుతారు. అంతే కాదు.. వ్యవసాయ భూమిని కొనడం కూడా ఇతర ప్రోత్సాహకాల కింద‌కు వస్తుంది. వ్యవసాయ భూమిని కొనడం వల్ల రాష్ట్రాన్ని బట్టి స్టాంప్ డ్యూటీ ఖర్చులు కూడా లేవు.. ఉన్నా అతితక్కువ క‌ట్టాలి. కాబట్టి రెండు ఎకరాలు కలిగి ఉన్న వ్యక్తికి పన్ను ప్రయోజనాలు కోటి కంటే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఔట‌ర్ వ్య‌వ‌సాయ భూముల్ని ప్ర‌యివేట్ పార్టీల‌కు ఉప‌యోగించి, ఆరేడు రోజులు బిజినెస్ చేసినా వాటి మెయింటెనెన్స్ వెళ్లిపోతుంది. ఈ భూమిని అమ్మితే సెక్షన్ 54బి కింద మూలధన లాభాలు పన్ను రహితంగా ఉంటాయి. తిరిగి ఆ డబ్బును పెద్ద వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ త‌ర‌హాలో వంద‌ల కోట్ల ప‌న్నులు ఎగ‌వేసేవారు హైద‌రాబాద్ లో ఉన్నార‌నేది కూడా ఒక విశ్లేష‌ణ‌.

పేద‌లు, మిడిల క్లాస్ వ‌ర్గాలు ఇప్పటికీ నగరంలో ఒక ఫ్లాట్ కోసం తగినంత ఆదా చేయడానికి క‌ష్ట‌ప‌డుతుంటే, సంపన్నులు నిశ్శబ్దంగా వ్యవసాయ భూములను ఒక తెలివైన ఆర్థిక సాధనంగా మారుస్తున్నారని ఇన్వెస్టిమెంట్ బ్యాంక‌ర్ ఎత్తి చూపారు. చ‌ట్ట‌ప‌రంగా లోటుపాట్ల‌ను ధ‌నికులు ఇలా ఉప‌యోగించుకుంటున్నార‌ని అత‌డు వివ‌రించాడు.

Tags:    

Similar News