రూమ్ నం.13 : ఉగ్ర కుట్రలకు కేరాఫ్.. ఫరీదాబాద్ మాడ్యూల్ అసలు రూపం ఇదీ
దిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూస్తున్నాయి.;
దిల్లీ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాల్లో ఒకేసారి దాడులకు పకడ్బందీ కుట్ర రచించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు మొత్తం ఎనిమిది మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు సమాచారం.
* ఉగ్ర కేంద్రంగా మారిన హాస్టల్: రూమ్ నం.13 కీలకం!
ఎన్ఐఏ అధికారులు దిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు చేస్తూ హరియాణాలోని అల్-ఫలా యూనివర్సిటీకి చేరుకున్నారు. ఇక్కడి మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్‌లోని 17వ నంబరు భవనం ముఖ్యంగా రూమ్ నం.13 ఉగ్ర కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా పనిచేసినట్లు నిర్ధారించారు.ప్రత్యేకంగా ముజమ్మిల్‌కు కేటాయించిన రూమ్ నం.13 లోనే ఈ దాడులపై ప్రధాన పథకం రచించారు.ఈ గదిలో జరిపిన సోదాల్లో యూనివర్సిటీ ల్యాబ్ నుంచి తెప్పించినట్లు భావిస్తున్న కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
*డైరీల్లో దాగిన దాడి
నిందితుడు డాక్టర్ ఉమర్ గది (రూమ్ నం.4) నుంచి స్వాధీనం చేసుకున్న మూడు డైరీల్లో కీలకమైన సమాచారం బయటపడింది. ఈ డైరీల్లో 25 మంది వ్యక్తుల పేర్లు, నవంబర్ 8 నుండి 12 వరకు తేదీల ప్రస్తావన, రహస్య సమావేశాలు, నిధుల సేకరణ వివరాలు వంటి అంశాలు ఉన్నాయి. డైరీల ప్రకారం, వారు దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
* 8 మంది సూసైడ్ బాంబర్లు సిద్ధం!
ఉగ్ర పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి లక్ష్య ప్రాంతానికీ ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది సూసైడ్ బాంబర్లను ఎంపిక చేసినట్లు డైరీల్లో సూచనలు లభించాయి. ఈ బృందంలో డాక్టర్ ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ అదల్, డాక్టర్ షాహీన్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆపరేషన్‌కు డాక్టర్ ఉమర్ నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది.
* పేలుళ్లకు నాలుగు కార్ల ప్రణాళిక
దాడుల కోసం నిందితులు నాలుగు కార్లను సిద్ధం చేయాలని ప్లాన్ చేశారు. i20 కారును ఎర్రకోట బ్లాస్ట్‌కు ఉపయోగించారు. ఎకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి రెండు కార్లు ఇంకా అన్వేషణలో ఉన్నాయి.
* 20 క్వింటాళ్ల ఎన్‌పీకే ఫర్టిలైజర్ కొనుగోలు
పెద్దఎత్తున పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఈ మాడ్యూల్ సభ్యులు దాదాపు రూ.20 లక్షలు నిధులు సేకరించారు. ఆ నిధులతో గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల నుంచి 20 క్వింటాళ్లకుపైగా ఎన్‌పీకే ఫర్టిలైజర్‌ను కొనుగోలు చేశారు. వీటిని ఉపయోగించి శక్తివంతమైన ఐఈడీ బాంబులు తయారు చేయాలని ఉగ్రవాదులు ఉద్దేశించినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో పోలీసులు జరిపిన మెరుపు సోదాల ద్వారా ఈ ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌ను సమర్థవంతంగా ఛేదించారు. దీనితో దేశవ్యాప్తంగా జరుగాల్సిన పెద్దఎత్తున దాడులను పోలీసులు సకాలంలో అడ్డుకుని, పెను ప్రమాదాన్ని నివారించారు.