ముస్లిం ప్రపంచంలో పట్టాభిషేకం చేసిన మొదటి మహిళ.. వజ్రాల కిరీటం ప్రత్యేకత ఇదే!
వాస్తవానికి ఇరానియన్ సంప్రదాయం ప్రకారం.. కిరీటాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఇరానియన్ సెంట్రల్ బ్యాంక్ లోని రాయల్ ఖజానాలో ఉంచబడిన జాతీయ నిధి నుండి వచ్చిన రత్నాలతో మాత్రమే అలంకరించాలి.;
సుమారు 60 సంవత్సరాల క్రితం, ఫరా పహ్లవి ఇరానియన్ చరిత్రలో పట్టాభిషేకం చేసిన మొదటి భార్యగా నిలిచారు! అంతే కాదు.. ముస్లిం ప్రపంచంలో ఎక్కడైనా పట్టాభిషేకం చేసిన మొదటి మహిళ కూడా ఆమె! ఆమె కిరీటం కూడా ఇలా ఎంతో ప్రత్యేకమైనది కావడం గమనార్హం. ఇరాన్ చివరి షా అయిన షా మొహమ్మద్ రెజా పహ్లవి 1966లో తన మూడవ భార్య ఫరా పహ్లవి కి కిరీటాన్ని అప్పగించాడు. ఆ సమయంలో ఆమెకు కేవలం 29 సంవత్సరాలు!
అవును... 1967లో వాన్ క్లీఫ్ & అర్పెల్స్ ద్వారా అత్యంత రహస్యంగా రూపొందించబడిన ఎంప్రెస్ కిరీటాన్ని ఫరా పహ్లావి పట్టాభిషేకం కోసం రూపొందించారు. సుమారు 2,500 సంవత్సరాలకు పైగా ఇరాన్ లో ఒక మహిళ పట్టాభిషేకం చేయడం ఇదే మొదటిసారి! దీని తయారీ కోసం నిపుణులను విమానంలో విదేశాల నుంచి రప్పించడం దగ్గర నుంచి.. ఇందులో పొదిగిన వజ్రాలు, పచ్చలు, కెంపులు, ముత్యాల వరకూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
వాస్తవానికి ఇరానియన్ సంప్రదాయం ప్రకారం.. కిరీటాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఇరానియన్ సెంట్రల్ బ్యాంక్ లోని రాయల్ ఖజానాలో ఉంచబడిన జాతీయ నిధి నుండి వచ్చిన రత్నాలతో మాత్రమే అలంకరించాలి. అది కూడా స్వదేశంలోనే తయారు చేయించాలి. విలువైన రాళ్లను దేశం విడిచి వెళ్ళడానికి ఇరాన్ సంప్రదాయం అనుమతించదు. దీంతో.. ఫ్రెంచ్ నుంచి వ్యాపారులను ఇరాన్ కు రప్పించి, తాత్కాలికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరీ ఈ కిరీటాన్ని రూపొందించారు.
ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్ లగ్జరీ నగల కంపెనీ వాన్ క్లీఫ్ & అర్పెల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని కీలక వ్యక్తి పియరీ అర్పెల్స్ ను కిరీటాన్ని తయారు చేయించడం కోసం ఇరాన్ కు విమానంలో తీసుకొచ్చారు. దీనికోసం ఆయన సుమారు 50 మోడల్స్ స్కెచ్ గీసి ఇవ్వగా.. ఫైనల్ గా ఒక దాన్ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల కాలంలో పియరీ అర్పెల్స్ టెహ్రాన్ కు 24 పర్యటనలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ లో ఉన్న నిధిలో ఉన్న రత్నాలను జాగ్రత్తగా ఎంచుకున్నారు.
ఇందులో భాగంగా 1,469 వజ్రాలు 36 పచ్చలు, 36 కెంపులు, 105 ముత్యాలతో పాటు 92 నుంచి 150 క్యారెట్ల మధ్య ఉన్న సెంట్రల్ పచ్చ కూడా రాణీ కిరీటంలో గౌరవ స్థానం పొందింది. ఫైనల్ గా ఆకుపచ్చ వెల్వెట్ టోపీతో కప్పబడిన కిరీటం.. ఒక జత చెవిపోగులు, రెండు పచ్చ పెండెంట్లు, ఒక నెక్లెస్ తయారు చేశారు. వీటన్నింటి బరువు దాదాపు 2 కిలోలు!
కాగా... అక్టోబర్ 26, 1967న.. షా మొహమ్మద్ రెజా పహ్లావి మొదట తనను తాను ఇరాన్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫరా పహ్లావి టెహ్రాన్ లోని అధికారిక రాజ కజార్ కాంప్లెక్స్ అయిన గోలెస్తాన్ ప్యాలెస్ లో పట్టాభిషేకం చేశారు.