పాక్ టు భారత్ వయా నేపాల్... చంగూర్ బాబా రూ.500 కోట్ల నెట్ వర్క్!
భారతదేశంలో సైంటిస్టుల కంటే బాబాలు బాగా ఫేమస్.. ఆ విషయం అందరికీ తెలిసిందే.;
భారతదేశంలో సైంటిస్టుల కంటే బాబాలు బాగా ఫేమస్.. ఆ విషయం అందరికీ తెలిసిందే. వారిని (గుడ్డిగా) నమ్మేవాళ్లు ఉన్నంత కాలం వారి మనుగడకు, వారిని ఆదర్శంగా తీసుకుని ఆ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఔత్సాహిక బాబాలకు ఎలాంటి ఢోకా లేదనే స్థాయిలో ఆ కెరీర్ ఉంటుందని చెబుతారు! ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వందల కోట్ల ఆర్థిక నెట్ వర్క్ ను కలిగిఉన్నట్లు చెబుతోన్న ఓ బాబా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... విదేశాల నుంచి అక్రమమ మార్గాల్లో సొమ్ములు పోగేసి.. అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న జలాలుద్దీన్ అలియస్ చంగూర్ బాబా వ్యవహారం తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఇతడి ఆర్థిక నెట్ వర్క్ ను ఛేదించే పనిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిమగ్నమైంది. అతడికి సంబంధించిన 30 బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు కొనసాగుతోండగానే మరో 18 ఖాతాలా సమాచారం వెలుగులోకి వచ్చింది!
వీటిల్లో సుమారు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... అతడి చీకటి ఆర్థిక కార్యకలాపాల నెట్ వర్క్ లో ఈ ఖాతాలు కూడా భాగమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతడి ఆర్థిక నెట్ వర్క్ భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అతడికి భారత్, నేపాల్ దేశాల్లో సుమారు 100 వరకు అకౌంట్లు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఈ క్రమంలో... కేవలం గత మూడేళ్లలోనే అతడికి దాదాపు రూ.500 కోట్ల విదేశీ నిధులు అందగా.. వాటిలో సుమారు రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో... ముఖ్యంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే, దుబాయ్ దేశాల నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీనికోసం నేపాల్ సరిహద్దులను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చంగూర్ బాబాను, బలరాంపుర్ లో సుమారు 70 గదులున్న భారీ విల్లాను ఇప్పటికే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. వీటిలో 40 గదులు కూలగొట్టారు. దీనికి కమాండోలు రక్షణగా ఉన్నారు. మరోవైపు ఏటీఎస్ బృందం అతడిని ఈ ఇంటికి తీసుకొచ్చి 40 నిమిషాలపాటు విచారించారు. ఈ సందర్భంగా ఆ విల్లా నుంచి కీలక డాక్యుమెంట్లు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా... చంగూర్ బాబా మతమార్పిడుల రాకెట్ ను నిర్వహించే క్రమంలో కోడ్ భాషను ఉపయోగించేవాడట. ఈ నేపథ్యంలో తాజాగా యూపీ ఏటీఎస్ దీనిని ఛేదించింది. ఇందులో భాగంగా... అతడి బృందం లక్ష్యంగా ఎంచుకొన్న మహిళలను 'ప్రాజెక్ట్' అని.. మతమార్పిడిని 'మిట్టీ పలట్నా' అని.. మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడాన్ని 'కాజల్ కర్నా' అని, అతడితో భేటీ ఏర్పాటు చేయడాన్ని 'దీదార్' అని వ్యవహరించేవాడని గుర్తించారు.