ఫ్యాక్ట్ చెక్ : పేర్ని నాని, గొట్టిపాటి రవి కలిసిన ఫొటో కథ ఇది..
ఈ సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో.. ఏది అబద్దమో తేల్చుకోవడం అంత ఈజీ కాదు. ఎవరినైనా టార్గెట్ చేయాలని అనుకుంటే చాలు ట్రోలర్లు రంగంలోకి దిగిపోతారు.;
ఈ సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో.. ఏది అబద్దమో తేల్చుకోవడం అంత ఈజీ కాదు. ఎవరినైనా టార్గెట్ చేయాలని అనుకుంటే చాలు ట్రోలర్లు రంగంలోకి దిగిపోతారు. అబద్ధాన్ని నిజమని నమ్మించేస్తారు. అయితే అదే సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ తో నిజాన్ని తెలుసుకోవచ్చు. కానీ, తరచూ బాధితులు తప్పుడు ప్రచారానికి బలైపోతూనే ఉంటారు. తాజాగా ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా ఇలానే బలైపోయారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కలిసి భోజనం చేస్తున్న ఫొటో ఒకటి కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీపై తీవ్ర స్థాయిల్ విరుచుకుపడుతున్న పేర్ని నాని పక్కనే గొట్టిపాటి ఉండటంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ఫొటో అసలు కథ తెలిసి అంతా అవాక్కు అవుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోపై ఫ్యాక్ట్ చెక్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పేర్ని, గొట్టిపాటి కలిసి ఉన్న ఫొటో చాలా పాత కాలం నాటిదని చెబుతున్నారు. 2014లో గొట్టిపాటి వైసీపీలో ఉండేవారు. గతంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతరం వైసీపీలో చేరారు. అయితే 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మధ్యలో పార్టీ మారారు. అప్పట్లో టీడీపీలోకి మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో గొట్టిపాటి కూడా ఒకరు. అయితే అంతకుముందు ఆయన వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. అప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోందని చెబుతున్నారు.
అయితే ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ఉండగా, ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన పేర్ని నానితో గొట్టిపాటి రవి కలిసి ఉన్న ఫొటో వెలికి తీయడం ఎందుకు? అన్న అనుమానాలపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పేర్ని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొద్ది రోజులుగా రాజకీయం మొత్తం ఆయనపైనే ఫోకస్ అయింది. ఈ పరిస్థితుల్లో ఆయనతో క్లోజ్ గా ఉన్న అధికార పార్టీ నేత ఫొటో బయటకు రావడంతో ఆయనను ఎవరు టార్గెట్ చేశారన్న చర్చ ఆసక్తి రేపుతోంది.
మంత్రిగా గొట్టిపాటి సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నా, ఆయనను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ సోషల్ మీడియానే ఈ ఫొటో బయటకి తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని బలోపేతం చేయాలంటే రవిని నైతికంగా వీక్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు ఈ ప్రచారం ద్వారా బయటపడినట్లు అనుమానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా చూపినా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. దీని కారణం గొట్టిపాటి రవి ప్రాబల్యమేనని ఆ పార్టీ నమ్ముతోందని అంటున్నారు. అందుకే వైసీపీ అధికారంలో ఉండగా, ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూసిందని, అయినా రవి తట్టుకుని నిలవడంతో ఇప్పుడు మానసికంగా ఆయనపై పైచేయి సాధించాలని ప్లాన్ చేస్తోందని అంటున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పేర్నితో గొట్టిపాటి చేతులు కలిపినట్లు ప్రచారం చేస్తే, టీడీపీ మిత్రపక్షాలకు ఆయన టార్గెట్ అవుతారని ఊహించింది. గతంలో కూడా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వంటివారు ఇలా టీడీపీ సోషల్ మీడియా ఆగ్రహాన్ని చవిచూడాల్సివచ్చిందని, ఇప్పుడు కూడా టీడీపీ సోషల్ మీడియాను రెచ్చగొట్టాలని భావించి పేర్నితో గొట్టిపాటి కలిసి ఉన్న ఫొటోను తవ్వితీశారని అంటున్నారు. దీనిద్వారా ఇటు టీడీపీ సోషల్ మీడియాను డైవర్ట్ చేయడంతోపాటు గొట్టిపాటి రవిని బద్నాం చేయొచ్చని రాజకీయ ప్రత్యర్థులు వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు.