సైబర్ నేరాల విశ్వరూపం.. 8 సెకన్లకు ఒక నేరం
ఎనిమిది సెకన్లు అంటే ఎనిమిది సెకన్లు. మరింత వివరంగా చెప్పాలంటే.. ఇప్పుడు మీరు ఈ వార్తను చదవటం మొదలు పెట్టి దగ్గర దగ్గర 8 సెకన్లు పడుతుంది.;
ఎనిమిది సెకన్లు అంటే ఎనిమిది సెకన్లు. మరింత వివరంగా చెప్పాలంటే.. ఇప్పుడు మీరు ఈ వార్తను చదవటం మొదలు పెట్టి దగ్గర దగ్గర 8 సెకన్లు పడుతుంది. ఇంత స్వల్ప వ్యవధిలో దేశంలో ఒకరు సైబర్ నేరానికి బాధితులుగా మారిపోయి ఉంటారు. సైబర్ నేరాల తీవ్రత ఎంత ఎక్కువ ఉందన్న దానికి ఇదో నిదర్శనంగా చెప్పాలి. 2023తో పోలిస్తే 2024లో సైబర్ నేరాల తీవ్రత ఏకంగా 209 శాతం పెరిగిన వైనాన్ని తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది.
గత ఏడాది అంటే 2024లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.22,854 కోట్లు. ఇంత భారీగా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్న వేళ.. వారికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్లు విసిరే ఉచ్చుల్లో ఇట్టే చిక్కుకుంటున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమ జీవిత కాలం కష్టపడి సంపాదించిన మొత్తాల్ని ఇట్టే పోగొట్టుకుంటున్నారు.
అత్యాశ..అమాయకత్వం.. అవగాహన లేకపోవటం.. అనవసర భయాందోళనలకు గురి కావటం లాంటి వాటితో సైబర్ నేరగాళ్లకు దొరికిపోతున్నారు. 2024లో దాదాపు 36 లక్షల మంది మోసపూరిత లింక్ ను తెరవటం.. మోసగాళ్ల ఫోన్ కాల్స్ కు స్పందించటం ద్వారా భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షల సిమ్ కార్డుల్ని.. 2.63 లక్షల ఎంఐ నెంబర్లను బ్లాక్ చేసింది. వివిధ బ్యాంకుల్లో సైబర్ నేరగాళ్లకు సంబంధించిన 24 లక్షల తప్పుడు బ్యాంకు ఖాతాల్ని గుర్తించి ఫ్రీజ్ చేసింది. గత ఏడాది 10,599 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.అయినప్పటికి భారీ ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతున్న వైనాన్ని చూస్తే.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఎవరో ఏదో భయపెట్టారని.. టెన్షన్ కు గురి చేశారని ఆగం కాకుండా ఉండటం చాలా అవసరం.