ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంపై ట్రాఫిక్ జామ్!
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులు ఒకరి వెనుక ఒకరు వందల సంఖ్యలో క్యూ కట్టారు.
సాధారణంగా మనకు సిటీల్లో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవ్వడం తెలుసు. కానీ, ఎక్కడో ఆకాశాన్ని తాకేలా ఉండే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతం మీద కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటే నమ్ముతారా? అవును, ఇది నిజం! ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులు ఒకరి వెనుక ఒకరు వందల సంఖ్యలో క్యూ కట్టారు. దీనికి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒకే రోజు రికార్డు స్థాయిలో క్లైంబింగ్:
ప్రపంచంలోనే అతిపెద్దదైన మౌంట్ ఎవరెస్ట్‌ను ఎక్కాలనేది ఎంతోమంది పర్వతారోహకుల జీవితకాల కల. అందుకే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే తాజాగా నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఏకంగా 274 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నారు. ఇక నేపాల్ వైపు నుంచి ఒకేరోజు ఇంతమంది ఎక్కడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
చైనా నో చెప్పడంతో పెరిగిన రద్దీ:
నిజానికి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి నేపాల్ వైపు నుంచి, అలాగే టిబెట్ వైపు నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. కానీ ఈసారి టిబెట్ వైపు నుంచి క్లైంబింగ్ చేయడానికి చైనా ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వలేదు. దీంతో పర్వతారోహకులందరికీ నేపాల్ రూట్ ఒక్కటే దిక్కయింది. ఇక ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ట్రావెలర్స్ అంతా ఒకే దారిలో ప్రయాణించాల్సి రావడంతో అక్కడ భారీ క్యూ ఏర్పడింది.
మంచు కొండల్లో ప్రమాదకరమైన క్యూ:
వైరల్ అవుతున్న వీడియోలో.. ఎముకలు కొరికే చలిలో, మైనస్ డిగ్రీల టెంపరేచర్ పర్వతారోహకులు ఒకరి వెనుక ఒకరు అడుగు తీసి అడుగు వేస్తూ లైన్ లో నిలబడటం కనిపిస్తుంది.ఇక ఇంత ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి చోట గంటల తరబడి క్యూలో వేచి ఉండటం ప్రాణాలతో చెలగాటమే అవుతుంది. ఈ 'పర్వత ట్రాఫిక్ జామ్' చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సాహసం చేయాలనే కోరిక మంచిదే కానీ, ఎవరెస్ట్ లాంటి ప్రమాదకరమైన చోట్ల కూడా ఇలా సిటీ రోడ్లను తలపించేలా ట్రాఫిక్ జామ్ ఏర్పడటం నిజంగా ఆందోళన కలిగించే విషయమే.ఇక ప్రకృతిని జయించాలనే మనుషుల తొందరపాటు.. అక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో చెప్పడానికి ఈ వైరల్ వీడియోనే ఒక ఉదాహరణ!