యూరప్‌లో ఊహించని పరిస్థితి.. రెండో రోజు విద్యుత్ లేక అల్లాడుతున్న ప్రజలు!
యూరప్ లోని అభివృద్ధి చెందిన దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో సోమవారం నుంచి లక్షలాది మంది విద్యుత్ అంతరాయం కారణంగా రాత్రంతా చీకటిలో గడపాల్సి వచ్చింది.;
యూరప్ లోని అభివృద్ధి చెందిన దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో సోమవారం నుంచి లక్షలాది మంది విద్యుత్ అంతరాయం కారణంగా రాత్రంతా చీకటిలో గడపాల్సి వచ్చింది. యూరోప్‌లోని విద్యుత్ గ్రిడ్‌లో సమస్య తలెత్తింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పౌరులు మొబైల్ నెట్‌వర్క్, కమ్యూనికేషన్‌కు అందుబాటు లేకపోవడం పై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, స్పెయిన్‌లో విద్యుత్ అంతరాయం మాడ్రిడ్‌లోని బరాజాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మీద కూడా ప్రభావం చూపింది. దీని కారణంగా అనేక విమానాలు ప్రభావితమయ్యాయి.
యూరోన్యూస్ పోర్చుగల్ ప్రకారం.. రైళ్లు స్టేషన్ల మధ్య సొరంగాల్లో చిక్కుకుపోయాయి. దీనివల్ల పోర్చుగల్, స్పెయిన్ రాజధానుల్లో చాలా మంది మెట్రోలోనే ఉండిపోయారు. మరోవైపు, రాయిటర్స్ పోర్చుగల్ పోలీసుల సమాచారం ప్రకారం, రైళ్లు నడవడం లేదు. పోర్టో, లిస్బన్‌లలో మెట్రో మూతపడింది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రభావితమయ్యాయి.
యూరోన్యూస్ స్పెయిన్ తెలిపిన వివరాల ప్రకారం.. స్పెయిన్ ప్రభుత్వం మోన్‌క్లోవాలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బ్లాక్‌అవుట్ కారణంగా అండోరా, స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల నివాసితులు కూడా ప్రభావితమయ్యారని సమాచారం. తాజా వార్తల ప్రకారం, బెల్జియంలో కూడా అంతరాయాలు నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే, యూరప్‌ను ఒక బ్లాక్‌అవుట్ 19వ శతాబ్దానికి తీసుకువెళ్లిందనిపిస్తోంది.