ఈటలకు బీజేపీలో పదవులు కష్టమేనా ?
ఈటల రాజేందర్. బీజేపీ ఎంపీగా ఉన్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి నేత. ఆయన మంచి సబ్జెక్ట్ తో అనర్గళంగా మాట్లడగల నాయకుడు.;
ఈటల రాజేందర్. బీజేపీ ఎంపీగా ఉన్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి నేత. ఆయన మంచి సబ్జెక్ట్ తో అనర్గళంగా మాట్లడగల నాయకుడు. అంతే కాదు ఆయనది పాతికేళ్ల ఉద్యమ నేపథ్యంతో కూడిన రాజకీయ అనుభవం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సీఎం మెటీరియల్. కానీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాల మధ్య ఆయన తాను పుట్టిన బీఆర్ఎస్ ని వీడారు. బీజేపీలో ఆయన ఎంత సుఖంగా ఉన్నారు అన్నది ఆలోచించాల్సిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఈటలను కూడా గట్టిగానే తప్పుపట్టింది.
బీజేపీకి ఇరకాటంగా :
ఇది ఇపుడు తెలంగాణా బీజేపీ పార్టీకి ఇరకాటంగా మారుతోంది అని అంటున్నారు. ఈటల ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి అది అప్పటి ఆయన పాత్ర అని బీజేపీ ఎంతలా తప్పించుకున్నా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్న ఘోష్ కమిషన్ నివేదిక బయటకు రావడంతో పెద్దగా మాట్లాడలేని పరిస్థితి అంటున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మీద బీజేపీ 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీబీఐ విచారణను జరిపిస్తామని కూడా చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం అదే విధంగా డిమాండ్ చేస్తోంది.
పూర్తి నివేదిక తరువాతనే:
ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణా ప్రభుత్వం అసెంబ్లీలో బయటపెడుతుంది. అపుడు పూర్తి నివేదిక వస్తుంది. దానిని చూసిన మీదటనే పూర్తి స్థాయిలో స్పందించాలని ప్రస్తుతానికి బీజేపీ నిర్ణయంగా ఉందని అంటున్నారు. తమ పార్టీకి చెందిన కీలక నేత ఎంపీ హోదాలో ఉన్న ఒక నాయకుడి విషయంలో నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు కమిషన్ చేసింది. దాంతో బీజేపీ ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతోంది అని అంటున్నారు అయినా సరే నివేదిక అనంతరమే ఒక లైన్ తీసుకోవాలని భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది.
ఒక వర్గం నుంచి సెగ :
అయితే బీజేపీలో ఈటల ఎంట్రీ తరువాత ఒక వర్గం ఆయనను వ్యతిరేకిస్తోంది అని ప్రచారంలో ఉంది. ఈటల సైతం ఈ మధ్యనే తన అనుచరులు అభిమానులతో సమావేశం పెట్టి పార్టీలో ప్రత్యర్థుల మీద గట్టిగానే మాట్లాడారు. ఆ తరువాత ఈ పరిణామం జరిగింది. దాంతో ఆ వర్గం నుంచి అయితే సెగ తగులుతోంది అని అంటున్నారు. నిజానికి ఈటలకు బీజేపీలో పెద్ద పదవులు అయితే దక్కలేదని అంటున్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చూసి వచ్చారు. ఎంపీ అయితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. అది దక్కలేదు, తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇస్తారు అనుకుంటే అది కూడా లభించలేదు. దాంతో ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉంది అనే అంటున్నారు.
అదే విధానమా :
రానున్న రోజులలో అయినా ఈటలకు పదవులు ఏవైనా దక్కుతాయని ఇప్పటిదాకా అనుచరులలో ఆశలు ఉండేవి అని చెప్పుకునేవారు. అయితే కాళేశ్వరం మీద కమిషన్ నివేదిక తరువాత ఈటల విషయంలో పార్టీ పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో అన్నది చర్చగా ఉంది. అయితే ఆయన ఎంపీగా మరో నాలుగేళ్ళ పాటు అలాగే ఉంటారు తప్ప పదవులు అయితే ఆయనకు దక్కడం ఇక మీదట కష్టమేనా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలో ఒక వర్గం ఇపుడు మరింత చురుగ్గా పనిచేస్తుంది అని అంటున్నారు. దాంతో ఈటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీద కూడా సందేహాలు అయితే ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద అయితే బీజేపీకి మాత్రం కాళేశ్వరం మీద కక్కలేక మింగలేక అన్నట్లుగా సీన్ ఉంది అని అంటున్నారు.