వెల్ కమ్ అంటోన్న ఎర్రమట్టి దిబ్బలు!
ఎర్రమట్టి దిబ్బలు ప్రకృతి చెక్కిన అందాలు. సహజ సిద్ధంగా ఏర్పడిన సొగసులు. సముద్రం నుంచి తోసుకొచ్చిన ఒండ్రు మట్టి కాస్తా కాలగమనంలో దిబ్బలుగా కొండలుగా మారిందని చెబుతారు.
ఎర్రమట్టి దిబ్బలు ప్రకృతి చెక్కిన అందాలు. సహజ సిద్ధంగా ఏర్పడిన సొగసులు. సముద్రం నుంచి తోసుకొచ్చిన ఒండ్రు మట్టి కాస్తా కాలగమనంలో దిబ్బలుగా కొండలుగా మారిందని చెబుతారు. ఇలా ఎరుపు రంగులో మట్టితో దట్టంగా నింపుకుని నిలువెత్తు శిఖరాలు వెలిసి వెలిగిపోతున్న తీరుతో విశాఖ జిల్లా భీమిలీ సాగర తీర ప్రాంతంలో ఉండడం ప్రత్యేకం అని చెప్పాలి. ఎర్రమట్టి దిబ్బలు చూసేందుకు అందుకే జనాలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ఎర్ర మట్టి దిబ్బల గురించి చెప్పాలంటే ఎన్నో సెల్యూలాయిడ్ ముచ్చట్ల గురించి కూడా చెప్పుకోవాలి.
వెండి తెర నిండుగా :
ఎర్ర మట్టి దిబ్బలు వెండి తెర నిండుగా పరచుకున్నాయి. ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితమే సినీ వినీలాకాశంలో అత్యంత ఆకర్షణీయమైన అందంగా ఎర్ర మన్ను దిబ్బలు ఆవిష్కరించబడ్డాయి. 1979లో వచ్చిన దాసరి నారాయణరావు గోరింటాకు సినిమాతో మొదలైన ఎర్ర మన్ను దిబ్బల సినీ అందాల ప్రదర్శన ఏకంగా యాభై నుంచి డెబ్బై సినిమాల దాకా సాగింది. అందులో తెలుగు తమిళ్ హిందీ ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. రాఘవేంద్రరావు, జంధ్యాల, మధుసూదనరావు వంటి ప్రముఖ దర్శకుల కెమెరాకు చిక్కిన ఎర్ర మన్ను దిబ్బలు అందాలు కోట్లాది మందిని ఆకట్టుకున్నాయి. దాంతో ఎర్ర మన్ను దిబ్బలకు సందర్శకుల తాకిడి కూడా నాటి నుంచే అధికం అయింది.
విశిష్టతను ఇనుమడింపజేసేలా :
ఇదిలా ఉంటే ఎర్ర మన్ను దిబ్బల గురించి మరింతా ఈ తరానికి తెలియచేసేలా అభివృద్ధి చర్యలను తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటక ప్రాంతంగా మరింతగా ప్రాధాన్యతను తీసుకుని రావాలని కూడా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం ఆసక్తిని చూపిస్తోంది. ఈ నేపధ్యంలో పర్యాటకంగా ఎర్రమట్టి దిబ్బలకున్న విశిష్టతను ప్రాముఖ్యతను ఇనుమడింపజేసేలా అభివృద్ధి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. విశాఖకు కొత్త కలెక్టర్ గా వచ్చిన ఆయన డైనమిక్ అధికారిగా అనేక చర్యలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఎర్రమట్టి దిబ్బలను సందర్శించిన అక్కడ పరిస్థితులను పరిశీలించారు.
టూరిజం స్పాట్ గా :
ఎర్ర మట్టి దిబ్బల గురించిన పలు అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. వాటికున్న విశిష్టత చరిత్ర గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విస్తీర్ణం సరిహద్దులు గురించి సమాచారం సేకరించారు. ఇతర సాంకేతిక పరమైన సమస్యలని కూడా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎర్రమట్టి దిబ్బల ప్రాముఖ్యతను అందరికీ తెలిపేలా అభివృద్ధి చర్యలు చేపట్టాలని అలాగే వ్యూ పాయింట్ ఆధునికీకరణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఎక్కడికక్కడ సూచిక బోర్డులు పెట్టాలని చెప్పారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని టూరిజం అధికారులను ఆదేశించారు. దాంతో రానున్న రోజులలో ఎర్ర మట్టి దిబ్బలకు మరింత ప్రాధాన్యత లభించనుంది. అధికారులు తీసుకునే చర్యల వల్ల పర్యాటకులు ఇంకా సులువుగా ఈ ప్రాంతానికి చేరుకుని అక్కడ ప్రకృతిని వీక్షించి ఆనందానుభూతిని పొందే వీలు ఉందని అంటున్నారు.