ఉక్రెయిన్‌కు మస్క్ స్పేస్ఎక్స్ బిగ్ షాక్.. ఇండియాకు ఝలక్ ఇవ్వడని గ్యారెంటీ ఉందా?
ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు అందిస్తున్న `స్టార్‌షీల్డ్` ఉపగ్రహ సేవలలో అనూహ్య ఆంక్షలు విధించింది.
ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు అందిస్తున్న `స్టార్‌షీల్డ్` ఉపగ్రహ సేవలలో అనూహ్య ఆంక్షలు విధించింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అమల్లోకి తెచ్చిన ఈ కొత్త నిబంధనలు యుద్ధ రంగంలో ఉక్రెయిన్ బలగాలకు తీవ్ర అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా రష్యాకు చెందిన దాడి డ్రోన్లను ఎదుర్కొనే క్రమంలో ఉక్రెయిన్ మిలిటరీ కార్యాచరణకు ఇది పెద్ద దెబ్బ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. గంటకు 100 మైళ్ల (160 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే ప్లాట్‌ఫారమ్‌లపై స్టార్‌షీల్డ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పనిచేయకుండా స్పేస్ఎక్స్ పరిమితులు విధించింది. రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సిగ్నల్స్ నిలిచిపోవడంతో స్పేస్ఎక్స్ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రష్యా ప్రయోగిస్తున్న జెట్ ఆధారిత షాహెద్ దాడి డ్రోన్లను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ఈ సేవలపైనే ఆధారపడుతోందని.. కొత్త ఆంక్షల వల్ల తమ రక్షణ వ్యవస్థ దెబ్బతింటుందని ఉక్రెయిన్ రక్షణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధభూమిలో ఈ ఆంక్షల ప్రభావం ఇప్పటికే ప్రారంభమైంది. ఉక్రెయిన్‌కు చెందిన 7వ రాపిడ్ రెస్పాన్స్ కార్ప్స్ ప్రకారం.. గులియైపోల్ ఫ్రంట్‌లో పనిచేస్తున్న కొన్ని అన్మ్యాన్డ్ విభాగాలు సిగ్నల్ కనెక్షన్ సమస్యల వల్ల తమ సైనిక మిషన్లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 100 మైళ్ల వేగ పరిమితి కంటే తక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కూడా సాంకేతిక ఆటంకాలు ఎదురవుతున్నాయని సైనికులు వెల్లడించారు.
ఈ ఆంక్షలపై ఉక్రెయిన్ ప్రభుత్వం స్పేస్ఎక్స్కు అధికారిక లేఖ రాసింది. అమెరికా ప్రభుత్వ ఒప్పందం ప్రకారం 2027 మే 15 వరకు భూభాగంతో పాటు మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లకు సేవలందించే ఒప్పందం ఉందని.. వెంటనే పాత కనెక్టివిటీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు పోలాండ్ విదేశాంగ మంత్రి రాడిస్లావ్ సికోర్స్కీ సోషల్ మీడియా వేదికగా ఇలాన్ మస్క్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఉక్రెయిన్‌లో పనిచేస్తున్న 2,900కు పైగా స్టార్‌లింక్ టెర్మినల్స్‌కు పోలాండే నిధులు సమకూరుస్తోందని.. వ్యాపార ఉత్పత్తులతో రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు.
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) స్పేస్‌ఫోర్స్ ద్వారా స్టార్‌షీల్డ్ సేవలకు కాంట్రాక్ట్ ఇస్తున్నా.. వ్యాపార సంస్థగా ఈ రకమైన వేగ పరిమితులను విధించే అధికారం స్పేస్ఎక్స్కు ఉందా లేదా పెంటగాన్దే చివరి నిర్ణయమా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈ సరికొత్త వివాదం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత రక్షణ మార్గాలపై కీలక ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది.
భారత్ మినహాయింపు కాదు:
గగనతలంలో ఒక దేశం ఏదైనా విదేశా(అమెరికా)నికి చెందిన స్పేస్ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటే బొక్క బోర్లా పడిపోవడం గ్యారెంటీ అని ఉక్రెయిన్ ఉదంతం నిరూపిస్తోంది. ఎలాన్ మస్క్ టెక్నాలజీ ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి పెను శాపంగా మారింది. శత్రువు రష్యాను ఎదుర్కోవడంలో అస్త్రాలేవీ పని చేయకపోవడానికి మస్క్ పన్నాగం ఒక కారణమని తేలిపోయింది. అలాంటి కుయుక్తుల అమెరికన్ భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందిస్తే, అది మన భద్రతా వ్యవస్థకు ఎలాంటి ముప్పుగా మారుతుందో ఊహించగలం. పాకిస్తాన్ లేదా చైనాతో యుద్ధం వస్తే, ఆ సమయంలో స్పేస్ ఎక్స్ మాత్రమే భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను కబ్జా చేసి నడిపిస్తుంటే పరిస్థితులు ఎలా మారుతాయో మన మేధావులు, టెక్ నిపుణులు ఆమాత్రం ఊహించలేరా? రిలయన్స్ అంబానీ కంపెనీలకే దేశ ప్రధాని కొమ్ము కాస్తున్నాడని మస్క్ విమర్శించిన నేపథ్యంలో అది సరైనదేనని కూడా ఇప్పుడు విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.