పాకిస్తాన్ పైలెట్లు-క్యాబిన్ సిబ్బంధిపై నిషేధం: ఎయిర్ ఫ్రాన్స్ మాత్రమేనా! ఇండియాపైనా ప్రభావం?!
ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న భద్రతాపరమైన ఉదంతం తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయించింది
ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న భద్రతాపరమైన ఉదంతం తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయించింది. ఇజ్రాయెల్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పాకిస్తాన్ సహా తమతో దౌత్య సంబంధాలు లేని దేశాలకు చెందిన పైలట్లు - క్యాబిన్ సిబ్బందిని తమ వైమానిక ప్రాంతం లేదా టెల్ అవీవ్‌కు విమానాలు నడిపేందుకు అనుమతించరు. ఈ క్రమంలో పాకిస్తాన్ సహా 31 ముస్లిం మెజారిటీ దేశాల పౌరసత్వం ఉన్న సిబ్బందిపై ఎయిర్ ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది.
ఈ కొత్త భద్రతా నిబంధనల వెనుక ఒక తీవ్రమైన సంఘటన ఉంది. సెప్టెంబర్ 30న దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్, విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై కూల్చివేసేందుకు యత్నించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతడు విమానంలోని భారతీయ పైలట్‌పై దాడి చేసినట్లు యుఏఈ - ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్ రవాణా మంత్రిత్వ శాఖ అక్టోబర్ 1 నుండి విదేశీ ఎయిర్‌లైన్స్‌కు కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇజ్రాయెల్ విధించిన ఈ నిషేధిత జాబితాలో పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, ఒమన్, అల్జీరియా, ట్యునీషియా , నైజర్ వంటి 31 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల పౌరసత్వం లేదా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న సిబ్బంది ఇజ్రాయెల్ విమాన సర్వీసుల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. తాము సర్వీసులు అందించే దేశాల ప్రవేశ నిబంధనలకు కట్టుబడి ఉండటం ఎయిర్‌లైన్ బాధ్యత అని.. అందువల్లే తమ సిబ్బందికి ఈ సమాచారాన్ని అందించి నిబంధనలు అమలు చేస్తున్నామని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది.
అయితే ఎయిర్ ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర న్యాయపరమైన, నైతికపరమైన వివాదాలకు దారితీస్తోంది. జాతీయత ఆధారంగా సిబ్బందిని వేరు చేయడం ఫ్రాన్స్ కార్మిక చట్టాలకు విరుద్ధమని.. ఇది పరోక్షంగా మతం లేదా జాతీయత ఆధారంగా వివక్ష చూపడమేనని న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. ఒక నిర్దిష్ట దేశ పౌరులందరినీ భద్రతా ముప్పుగా భావించడం వివక్షాపూరిత ధోరణి అని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయ విమానయాన చట్టాల ప్రకారం ప్రతి దేశానికి తన వైమానిక సరిహద్దులపై సార్వభౌమాధికారం ఉంటుందని.. భద్రత దృష్ట్యా దేశాలు నిబంధనలు విధించే హక్కు కలిగి ఉంటాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎయిర్ ఫ్రాన్స్ మాత్రమే కాకుండా చెక్ ఎయిర్‌లైన్స్ స్మార్ట్వింగ్స్ వంటి ఇతర సంస్థలు కూడా ఈ ఆదేశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. గ్లోబల్ విమానయాన రంగంలో భద్రత - కార్మిక హక్కుల నడుమ ఈ వివాదం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. అయితే ఇజ్రాయేల్ , ఎయిర్ ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయాలే భారతీయ విమానయాన రంగానికి వర్తిస్తాయా? ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు అమల్లో ఉన్నాయి? అనేదానిపైనా చర్చ సాగుతోంది.
భారత్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న భద్రతా నిర్ణయాలు (DGCA సలహాలు):
భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఇజ్రాయెల్-పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రింది నిర్ణయాలు- మార్గదర్శకాలను అమలు చేస్తోంది:
వైమానిక ప్రాంతాల నియంత్రణ:
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, క్షిపణి దాడుల భయం ఉన్నందున ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, లెబనాన్ వంటి సున్నితమైన ప్రాంతాల మీదుగా విమానాలు ఎగరకూడదని డీజీసీఏ భారతీయ విమాన సంస్థలను ఆదేశించింది.
రూట్ల మార్పిడి :
ఐరోపా, అమెరికా , పశ్చిమాసియా వెళ్లే భారతీయ విమానాలు (ఎయిర్ ఇండియా, ఇండిగో) సురక్షితమైన ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా ప్రయాణిస్తున్నాయి.
క్రూ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్:
భారతదేశంలో పైలట్లు -విమాన సిబ్బందికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ద్వారా అత్యంత కఠినమైన పోలీసు బ్యాక్‌గ్రౌండ్ చెక్ , సెక్యూరిటీ క్లియరెన్స్ పూర్తయిన తర్వాతే లైసెన్సులు, ఉద్యోగాలు కేటాయిస్తారు.
సారాంశమేమిటంటే.. ఎయిర్ ఫ్రాన్స్ వర్తింపజేసిన ఆంక్షలు కేవలం ఇజ్రాయెల్‌తో శత్రుత్వం లేదా దౌత్య సంబంధాలు లేని దేశాల పౌరులకే వర్తిస్తాయి. భారత్‌కు ఇజ్రాయెల్‌తో మంచి బంధం ఉన్నందున భారతీయ క్రూ సభ్యులకు ఈ నిషేధంతో ఎటువంటి ఇబ్బంది లేదు.